Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం 100వ రోజుకు చేరుకుంది. రాజస్థాన్‌లో సాగుతున్న యాత్రలో భాగంగా భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, పార్టీలోని ప్రముఖ నేతలు పాల్గొన్నారు. హిమాచల్ నూతన సీఎంతో పాటు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి రాహుల్ పాదయాత్రలో ఉత్సాహంగా ముందుకు సాగారు. ఈ సందర్భంగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తో కలిసి రాహుల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై కేంద్రం తీరును తీవ్రంగా రాహుల్ ఖండించారు.
చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. అయితే ప్రభుత్వం మాత్రం అసలు వాస్తవాన్ని దాచేందుకు ప్రయత్నిస్తోందని రాహుల్ అన్నారు. సరిహద్దుల్లో చైనా ప్రవర్తన, భారత భూభాగంలోకి చొరబాటు ప్రయత్నం, వారి ఆయుధాల నమూనా చూస్తుంటే యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు ప్రతీ ఒక్కరికి అర్థమవుతుందని, కానీ కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించేందుకు ఎందుకు వెనుకాడుతుందని అన్నారు. కేంద్రం సంఘటనలపైనే ఆలోచిస్తుందని, అసలు ఏం చేయాలన్న వ్యూహం కేంద్రం వద్ద లేదని విమర్శించారు. చైనా మన భూమిని లాక్కుంది. మన సైనికులను తరిమికొడుతున్నారు. చైనా నుంచి ఈ విధంగా ముప్పు స్పష్టంగా కనిపిస్తుందని రాహుల్ అన్నారు. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో సెక్టార్లలో చైనా దాడికి సిద్ధపడుతున్నా కేంద్ర నిద్రపోతుందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యతరం వ్యక్తం చేశారు. భారత సాయుధ బలగాల శౌర్యాన్ని రాహుల్ అనుమానిస్తున్నారంటూ వారు విమర్శించారు. యూనిఫాంలో ఉన్న భారత బలగాలు చైనా సైనికులపై ఎలా విరుచుకుపడ్డారనేది ఒక్క రాహుల్ గాంధీ మినహా ప్రతీ భారతీయుడు వీక్షించి, గర్వించారని అన్నారు. రాహుల్ కుటుంబం చైనీయుల ఆదరాభిమానాలు పొందుతూ, ఆర్జీ ఫౌండేషన్‌కు నిధులు అందుకుంటోందని బీజేపీ ఐటీ విభాగం ఇన్‌ఛార్జి అమిత్ మాలవీయ ఒక ట్వీట్‌లో విమర్శించారు.