Rajasthan Bus Fire Accident: రాజస్థాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వెళుతున్న ఒక ప్రైవేటు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఘటనలో 10 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం. చిన్నారులతో సహా 14 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక జవహర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/women-missing-cases-karimnagar-telangana-ncrb-data/
జైసల్మేర్ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు 57 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేట్ బస్సు జోధ్‌పూర్ బయలుదేరింది. ఈ క్రమంలో జైసల్మేర్‌కు 20 కి.మీ దూరంలోని థాయత్ గ్రామ సమీపంలోకి రాగానే బస్సు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే భారీ ఎత్తున మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయారు. దుర్ఘటనలో 10 మంది మృత్యువాత పడగా.. పలువురికి గాయాలయ్యాయని సమాచారం.
స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


