రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే పుట్టినరోజు సందర్భంగా అత్యంత ఆడంబరంగా ఆమె బర్త్ డే పార్టీ ఇస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజే తన పుట్టినరోజును అత్యంత వేడుకగా, పొలిటికల్ పార్టీగా జరపాలని భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే రాజస్థాన్ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఈమధ్య తారాస్థాయికి చేరటంతోపాటు రాజేను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ ససేమిరా అనటంతో ఆమె ఒంటెత్తు పోకడలను అనసరిస్తూపోతున్నారు. ఈనేపథ్యంలో రాజే వెంట నడవటమంటే కత్తి మీద సాములా రాష్ట్ర బీజేపీ నేతలకు మారింది. ఇప్పటికీ ఆమె మంచి క్రౌడ్ పుల్లర్, ఇమేజ్ ఉన్న లీడర్. రాజే పుట్టిన రోజు వేడుకలకు డుమ్మా కొడితే ఆమె వర్గం ఆగ్రహిస్తుందనే భయం పట్టుకుంది రాష్ట్ర నేతలకు. సీఎంలను మారుస్తూ హ్యాట్రిక్ విజయాలు కొడుతున్న మోడీ-షా గత కొంతకాలంగా రాజేను ఎంకరేజ్ చేయకపోగా ఆమె ప్రాధాన్యతను కూడా పార్టీలో బాగా తగ్గించారు. అయినా పట్టు వదలని ఆమె అవకాశాలు సృష్టించుకుని మరీ బీజేపీ అధిష్ఠానంపై నిప్పులు చెరుగుతూ తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకునే పనిలో ఉన్నారు.
కాగా బీజేపీ యువ మోర్చా అధ్వర్యంలో సీఎం అశోక్ గెహ్లాట్ ఇంటిముందు భారీ నిరసన కార్యక్రమాన్ని రాజే పుట్టినరోజు నాడే నిర్వహిస్తున్నారు. పరీక్షా పత్రాలు లీక్ కావటంపై బీజేపీ యూత్ వింగ్ ఈ భారీ ధర్నాను చేపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు ఎటువైపు ఉండాలో తేల్చుకోలేకపోతున్నారు. యువ మోర్చా కార్యక్రమాన్ని భారీ స్థాయిలో విజయవంతం చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలకు ఆదేశాలు అందిన నేపథ్యంలో వారు రాజే పార్టీకి వెళ్లటం కుదరదు. అలాగని ధైర్యం చేసి ఓ నిర్ణయం తీసుకోలేక బీజేపీ ఎమ్మెల్యేలు సందిగ్ధంలో పడ్డారు. ధర్నా ద్వారా తమ బలం చాటాలని ఓవైపు ఆదేశాలు జారీకాగా తన సొంత బలాన్ని చాటుకోవటానికి రాజే బర్త్ డే పార్టీని నిర్వహిస్తున్నారు.
మొత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియాకు మాజీ సీఎం రాజేకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరి పార్టీకి నష్టం చేకూర్చేలా మారిపోయాయని బీజేపీ కార్యకర్తలే తలలు పట్టుకుంటున్నారు. ఇక తనకున్న ప్రజాదరణను చాటుకోవటానికి ఏటా తన పుట్టినరోజును ఏదో ఒక జిల్లాలో చాలా గ్రాండ్ గా జరుపుకోవటం వసుంధర రాజే పొలిటికల్ స్ట్రాటెజీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఆమె చురు జిల్లాలో భారీ బడ్జెట్ తో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటూ బీజేపీ అధిష్ఠానానికి తన బలాన్ని చాటుకుంటున్నారు.