Rajnath Singh : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై 50% టారిఫ్‌ను విధించడంతో, భారత్-అమెరికా మధ్య ఆయుధాలు, విమానాల కొనుగోళ్ల తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ నిర్ణయంతో ద్వైపాక్షిక సంబంధాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఇక ఈ నేపథ్యంలోనే రక్షణ శాక మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వాషింగ్టన్ పర్యటన సైతం రద్దయింది.
ఆగస్టు 6న ట్రంప్, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చుతోందని ఆరోపిస్తూ, భారత వస్తువులపై అదనంగా 25% టారిఫ్ విధించారు. దీంతో భారత్ ఎగుమతులపై మొత్తం సుంకం 50%కి చేరింది. ఇది అమెరికా వాణిజ్య భాగస్వాములలోనే అత్యధికంగా మారింది. భారత్ ఈ టారిఫ్‌లను అన్యాయమైనవిగా, అసమంజసమైనవిగా ఖండించింది. అమెరికా, ఐరోపా దేశాలు కూడా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్నాయని పేర్కొంది.
ALSO READ : MS Swaminathan : భారతమాత ముద్దుబిడ్డ స్వామినాథన్ – ప్రధాని మోదీ భావోద్వేగ నివాళి!
జనరల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్స్ తయారు చేసిన స్ట్రైకర్ కంబాట్ వెహికల్స్, రేథియాన్, లాక్‌హీడ్ మార్టిన్ అభివృద్ధి చేసిన జావెలిన్ యాంటీ-ట్యాంక్ మిస్సైల్స్ కొనుగోళ్లను టారిఫ్‌ల కారణంగా నిలిపివేశారు. ఫిబ్రవరిలో ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆయుధాల కొనుగోలు, సంయుక్త ఉత్పత్తిపై ప్రకటన చేశారు. అలాగే, రాజ్‌నాథ్ సింగ్ తన పర్యటనలో భారత నౌకాదళం కోసం ఆరు బోయింగ్ P8I రికనైసెన్స్ విమానాలు, సపోర్ట్ సిస్టమ్స్‌ను 3.6 బిలియన్ డాలర్ల డీల్‌లో కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించాలనుకున్నారు.
ALSO READ : MEA on US tariffs : సుంకాల వెనుక లాజిక్ లేదు – ట్రంప్ చర్య ఏకపక్షం!
కొనుగోళ్లను నిలిపివేయడానికి రాతపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని, టారిఫ్‌లపై స్పష్టత వచ్చిన తర్వాత కొనుగోళ్లు మళ్లీ ప్రారంభమవచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుతానికి ఎటువంటి పురోగతి లేదని తెలుస్తుంది. భారత్, అమెరికా మధ్య రక్షణ భాగస్వామ్యం, చైనాతో ఉమ్మడి వ్యూహాత్మక పోటీ కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడినప్పటికీ.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై విమర్శలు ఈ సంబంధాలను దెబ్బతీశాయి.
భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు కాగా, రష్యా ప్రధాన సరఫరాదారుడిగా ఉంది. అయితే ఈ మధ్య భారత్.. ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా నుంచి దిగుమతులను పెంచింది. రష్యా ఆయుధ ఎగుమతులపై ఆంక్షలు, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఆయుధాల పనితీరు క్షీణించడం ఈ మార్పుకు కారణమయ్యాయి. అయినప్పటికీ, రష్యాతో దశాబ్దాల సుదీర్ఘ భాగస్వామ్యం కారణంగా భారత్ పూర్తిగా రష్యా ఆయుధాలపై ఆధారపడకపోవచ్చని తెలుస్తుంది.


