Politicization of Indian Army : భారత సైన్యంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సైన్యంలో కులాల ప్రస్తావన తెచ్చిన రాహుల్‌పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సైనికులకు ఉండేది ఒకే మతమని, అది ‘సైన్య ధర్మం’ మాత్రమేనని ఉద్ఘాటించారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా, రాహుల్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ ఘాటుగా స్పందించారు.
సైన్యానికి మతం లేదు.. ధర్మం మాత్రమే : “భారత సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు,” అంటూ రాహుల్ గాంధీకి రాజ్‌నాథ్ సింగ్ హితవు పలికారు. బంకాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, “దేశంలో రిజర్వేషన్లు ఉండాలి, బీజేపీ కూడా వాటికి మద్దతిస్తుంది. కానీ మన సైనికులకు ఉండేది ఒకే మతం, అది సైన్య ధర్మం. దయచేసి మన సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగకండి,” అని స్పష్టం చేశారు. సాయుధ దళాల్లో రిజర్వేషన్లు డిమాండ్ చేయడం ద్వారా రాహుల్ గాంధీ దేశంలో అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
దేశాన్ని నడపడం పిల్లల ఆట కాదు : రాహుల్ గాంధీ తీరును ఎద్దేవా చేసిన రాజ్‌నాథ్, ఆయన ఇటీవలి చర్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “కాంగ్రెస్ నాయకుడికి చెరువులోకి దూకి చేపలు పట్టడం తప్ప వేరే మార్గం లేనట్టుంది. దేశాన్ని నడపడం పిల్లల ఆట కాదు,” అని ఆయన ధ్వజమెత్తారు.
‘ఆపరేషన్ సిందూర్’ ఆగలేదు.. విరామమే : ఈ సందర్భంగా, పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “కశ్మీర్‌లో మన వారిని మతం అడిగి మరీ చంపారు. ఆ తర్వాత మేం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి పాక్‌లోని ప్రధాన ఉగ్రవాద స్థావరాలను తుదముట్టించాం. ఆ ఆపరేషన్ ఇంకా ముగియలేదు, కేవలం విరామం ఇచ్చామంతే. భారత్‌ను ఎవరైనా రెచ్చగొడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మళ్లీ దాడికి ప్రయత్నిస్తే తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటాం,” అని గట్టిగా హెచ్చరించారు.
రాహుల్ వ్యాఖ్యలేంటి : ఇటీవల బిహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, భారత సైన్యం దేశ జనాభాలోని 10 శాతం మంది అగ్రవర్ణాల నియంత్రణలో ఉందని ఆరోపించారు. 90 శాతం ఉన్న దళితులు, బీసీలు, మైనారిటీలకు బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థ, సైన్యంలో సరైన ప్రాతినిధ్యం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే రాజ్‌నాథ్ ఆగ్రహానికి కారణమయ్యాయి.
బిహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా, ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది.


