RBI Governor| రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్(Shaktikanta Das) అనారోగ్యంతో బాధపడుతున్నారు. అసిడిటీతో బాధపడుతున్న ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం శక్తికాంత దాస్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆర్బీఐ అధికార ప్రతినిధి కూడా తెలిపారు. చింతించాల్సిన పనిలేదన్నారు.
కాగా ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ పదవీ కాలం డిసెంబర్ 10తో ముగియనుంది. అయితే మరోసారి ఆయన్ని ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరేళ్ల క్రితం ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతో ఆర్బీఐ 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు స్వీకరించారు. అయితే తన పదవీ కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తమిళనాడు కేడర్‌కు చెందిన శక్తికాంత్ దాస్ 1980 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. గతంలో ఆయన 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా పని చేశారు. అలాగే కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాలకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగానూ పని చేశారు. రెవెన్యూ కార్యదర్శిగా, ఫెర్టిలైజర్స్ సెక్రటరీగా వివిధ కేంద్ర ప్రభుత్వ హోదాల్లో పనిచేశారు. అనంతరం ఆర్బీఐ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇప్పటికే ఐదేళ్ల కంటే ఎక్కువకాలం ఆ పదవిలో పనిచేస్తున్నారు. మరోసారి ఆయన పదవీకాలం పొడిగిస్తే బెనగల్ రామారావు (Benegal Rama Rau) తర్వాత అత్యధిక కాలం ఆర్బీఐ గవర్నర్‌గా చేసిన వ్యక్తిగా నిలవనున్నారు.