దేశీయ మార్కెట్లో నకిలీ రూ.500 నోట్లు పెద్ద ఎత్తున చెలామణిలో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. అత్యాధునిక టెక్నాలజీతో తయారుచేసిన రూ.500 దొంగనోట్లు (Rs 500 Notes) విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఈ దొంగనోట్ల ప్రింటింగ్, నాణ్యత చాలావరకు అసలు నోట్లు లాగే ఉన్నట్లు వెల్లడించింది. అందుచేత వాటిని గుర్తించడం కూడా చాలా క్లిష్టంగా మారిందని తెలిపింది. కాకపోతే ఈ నోట్లలో ఒక చిన్న స్పెల్లింగ్ తప్పు ఉందని వివరించింది.
“RESERVE BANK OF INDIA” అనే దానిలో ‘‘RESERVE’’ పదంలో ‘E’ బదులు ‘A’ పడినట్లు చెప్పింది. దీనిని గుర్తించాలంటే ఆ నోటును క్షుణ్ణంగా పరీక్షించాల్సి ఉంటుంది. ఇలాంటి నకిలీ నోట్లు విషయంలో ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఏజెన్సీలను అప్రమత్తం చేసినట్లు పేర్కొంది. ఈ నకిలీ నోట్ల విషయంలో ప్రజలు, వ్యాపార సంస్థలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.