Saturday, November 15, 2025
Homeనేషనల్From Poverty to Power: కుటుంబం కోసం కుంగిపోలేదు.. కష్టాలనే గెలిచింది! 14 ఏళ్లకే పెళ్లి...

From Poverty to Power: కుటుంబం కోసం కుంగిపోలేదు.. కష్టాలనే గెలిచింది! 14 ఏళ్లకే పెళ్లి వద్దని.. ఎస్సై అయి నిలిచింది!

Inspirational success story :  తపన, ఆత్మవిశ్వాసం తోడైతే ఎలాంటి కష్టాన్నైనా జయించవచ్చని నిరూపించింది బిహార్‌కు చెందిన రుచి మిశ్రా. కంటికి రెప్పలా కాపాడే తండ్రి అకాల మరణంతో ఆ కుటుంబం వీధిన పడింది. 14 ఏళ్లకే బంధువులు పెళ్లి పేరెత్తారు. కానీ, కన్నతల్లి, తోబుట్టువుల భవిష్యత్తు కోసం ఆ పెళ్లిని తిరస్కరించి, ఒంటరి పోరాటానికి సిద్ధమైంది. అడ్డంకులను అధిగమించి, కుటుంబాన్ని విజయ తీరాలకు చేర్చడమే కాకుండా, తాను ఖాకీ దుస్తులు ధరించి సగర్వంగా నిలిచింది. ఆ అకుంఠిత దీక్షాదక్షత వెనుక ఉన్న కన్నీటి ప్రయాణం ఏమిటి? ఆమే తన కుటుంబాన్ని ఎలా గెలిపించింది?

- Advertisement -

కుప్పకూలిన సౌధాలు : బిహార్‌లోని ఖగారియా జిల్లాకు చెందిన రుచి మిశ్రాది ఒకప్పుడు సకల సౌకర్యాలున్న వ్యాపార కుటుంబం. 2010లో తాతయ్య చంద్రకాంత్ మిశ్రా మరణంతో వ్యాపారం దెబ్బతింది. ఆ నష్టాల నుంచి కోలుకుంటున్న సమయంలోనే, 2012లో విధి మరో దెబ్బ తీసింది. నెల రోజుల వ్యవధిలోనే రుచి నాన్నమ్మ ఆశా దేవి, తండ్రి ప్రశాంత్ కన్నుమూశారు. దీంతో రుచి, ఆమె తల్లి, చెల్లెలు సుప్రియ, తమ్ముడు శివంతో కలిసి ఆ కుటుంబం అనాథగా మారింది. ఆదాయాన్ని ఆర్జించే పెద్ద దిక్కును కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయింది.

14 ఏళ్లకే పెళ్లి ప్రస్తావన.. తిరస్కరించిన ధీర : ఈ క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన బంధువులు, 14 ఏళ్ల రుచికి పెళ్లి సంబంధం తెచ్చారు. అబ్బాయి పెద్దగా చదువుకోకపోయినా ఆస్తిపరుడని, పెళ్లి చేస్తే కుటుంబం గట్టెక్కుతుందని నచ్చజెప్పారు. కూతురి పెళ్లితో కష్టాలు తీరతాయేమోనని తల్లి కూడా ఒక దశలో అంగీకరించారు. కానీ రుచి ఆలోచన మరోలా సాగింది. “నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే అమ్మ, చెల్లి, తమ్ముడి గతేంటి? వారిని ఎవరు చూసుకుంటారు? ఒకవేళ నా భర్త వారి బాధ్యతను నిరాకరిస్తే నా కుటుంబం పరిస్థితి ఏంటి?” అని మధనపడింది. కుటుంబ భవిష్యత్తు కోసం ఒంటరి పోరాటమే శరణ్యమని నిర్ణయించుకుని, పెళ్లికి నిర్ద్వంద్వంగా నిరాకరించింది. ఈ నిర్ణయంతో బంధువులు దూరమైనా, ఆమె వెనకడుగు వేయలేదు. తల్లికి ధైర్యం చెప్పి, చదువుపై దృష్టి సారించింది.

ఒకవైపు చదువు.. మరోవైపు సంపాదన : అప్పటి నుంచి రుచి ప్రస్థానం కష్టాల కడలిలో సాగింది. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో టాపర్‌గా నిలిచి జిల్లా మెజిస్ట్రేట్ చేతుల మీదుగా పతకం అందుకుంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇంటర్ పూర్తి చేసింది. ఈ క్రమంలో కుటుంబ పోషణ కోసం ట్యూషన్లు చెప్పింది. నెలకు రూ.1500 జీతానికి ఓ పాఠశాలలో పార్ట్‌టైమ్ టీచర్‌గా పనిచేసింది. 2015-18 మధ్య భాగల్పూర్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతూ, ఖర్చుల కోసం రిసెప్షనిస్ట్‌గానూ పనిచేసింది.

ఒక్కరే కాదు.. ముగ్గురూ సైనికులే: ఈ పోరాటంలో రుచికి ఆమె తోబుట్టువులు సైతం అండగా నిలిచారు. తమ్ముడు శివం కుమార్ పిండిగిర్నీ నడుపుతూ కుటుంబానికి ఆసరాగా నిలిస్తే, చెల్లెలు సుప్రియ పిల్లలకు ట్యూషన్లు చెప్పి తన వంతు సహకారం అందించింది. కొన్నిసార్లు ఇంట్లో కూరగాయలకు, రేషన్‌కు కూడా డబ్బులు లేని దుస్థితిని ఎదుర్కొన్నా, కడుపు మాడుతున్నా ఎవరినీ చేయి చాచి అడగలేదు.

తొలి ప్రయత్నంలోనే ఖాకీ విజయం : “2019లో సబ్ ఇన్‌స్పెక్టర్ నోటిఫికేషన్ వెలువడగానే దరఖాస్తు చేశాను. నా కఠోర శ్రమ ఫలించి, తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్, ఫిజికల్ పరీక్షల్లో అర్హత సాధించాను. రాజ్‌గిర్‌లో శిక్షణ అనంతరం, 2022 జనవరి 26న ఎస్సైగా విధుల్లో చేరాను. ప్రస్తుతం మధుబని జిల్లాలో పనిచేస్తున్నాను. ఇప్పుడు నా చెల్లెలు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, తమ్ముడు ఇండియన్ ఆయిల్‌లో ఇంజినీర్. నా గురువులు, కుటుంబం, స్నేహితులు, దుర్గామాత ఆశీస్సులు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు,” అని రుచి మిశ్రా తన విజయ ప్రస్థానాన్ని వినమ్రంగా వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad