Shubhanshu Shukla ISS Tour: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తన అంతరిక్ష ప్రయాణాన్ని ఒక అద్భుత అనుభవంగా అభివర్ణించారు. అంతరిక్షం నుంచి భారత్‌ను చూసినప్పుడు అద్భుతంగా అనిపించిందని పేర్కొన్నారు. భారత్ వైపు తాను చూపును మరల్చినప్పుడు తనకు అత్యంత ధైర్యంగా, ఆశయాలతో నిండిన మనసుతో పాటు, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతున్న దేశంగా కనిపించిందని అన్నారు. దేశం గురించి గర్వంగా అనిపించిందని చెబుతూ, 1984లో రాకేశ్ శర్మ చెప్పిన “సారే జహాసే అచ్చా” మాటలను గుర్తుచేశారు.
శుభాంశు శుక్లా, యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లిన నాలుగు మంది వ్యోమగాముల్లో ఒకరు. ఈ నెల 15న వారు భూమికి తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలో, అంతరిక్ష కేంద్రంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించగా, శుభాంశు తన అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రయాణం మాయల ప్రపంచంలా అనిపించిందని, ఎన్నో మధుర జ్ఞాపకాలు, విలువైన అనుభవాలతో తిరిగి వెళ్తున్నానని చెప్పారు. వీటిని భారత ప్రజలతో పంచుకుంటానని అన్నారు.
గత నెల 25న శుభాంశు బృందం అంతరిక్ష యాత్ర ప్రారంభమైంది. సుమారు 28 గంటల ప్రయాణం తర్వాత వారు ISSలోకి ప్రవేశించారు. అక్కడ 18 రోజుల పాటు ప్రయోగాలు, పరిశోధనల్లో పాల్గొన్నారు. తాజాగా, భారత కాలమానం ప్రకారం జూలై 14న వారు భూమిపైకి ప్రయాణం ప్రారంభిస్తారు. జూలై 15 మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారి వ్యోమనౌక అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో దిగనుంది. ఈ మిషన్ ద్వారా శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణంలో తనదైన ముద్ర వేసి, భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు.