Sonia Gandhi citizenship voter list controversy : దేశ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఓట్ల చోరీ ఆరోపణలతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ పౌరసత్వంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సంచలన ఆరోపణలు చేసింది. భారత పౌరసత్వం స్వీకరించక ముందే ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఎలా నమోదైందని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఇది ఎన్నికల ప్రక్రియలో జరిగిన అతిపెద్ద మోసాలలో ఒకటని కమలం పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. అసలు ఈ వివాదం ఏమిటి…? బీజేపీ ఆరోపణలలో నిజమెంత..? దీనిపై కాంగ్రెస్ స్పందన ఏంటి..?
ఆరోపణల పరంపర : ఎన్నికల సంఘం (ఈసీ), బీజేపీ కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో, బీజేపీ ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ పార్టీయే గతంలో అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ, సోనియా గాంధీ పౌరసత్వ అంశాన్ని తెరపైకి తెచ్చింది.
బీజేపీ వాదనలు: బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఆరోపణలకు పదును పెట్టారు. వారి వాదనల ప్రకారం..
1980లో తొలిసారి ఓటరుగా నమోదు: సోనియా గాంధీకి భారత పౌరసత్వం ఏప్రిల్ 30, 1983న లభించింది. అయితే, అంతకు మూడేళ్ళ ముందే, అంటే 1980లోనే న్యూఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో ఆమె పేరు చేర్చారని బీజేపీ ఆరోపిస్తోంది. ఆ సమయంలో ఆమె ఇటలీ పౌరురాలని, ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950కి పూర్తి విరుద్ధమని వారు పేర్కొన్నారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అధికారిక నివాసమైన 1, సఫ్దర్‌జంగ్ రోడ్ చిరునామాలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, మేనకా గాంధీలతో పాటు సోనియా పేరు కూడా ఉందని మాలవీయ సోషల్ మీడియాలో ఓటరు జాబితా నకలును పోస్ట్ చేశారు.
1982లో తొలగింపు, 1983లో పునః చేర్పు: ఈ విషయంపై 1982లో నిరసనలు వెల్లువెత్తడంతో, ఆమె పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించారని బీజేపీ తెలిపింది. అయితే, 1983 జనవరిలో, ఆమెకు అధికారికంగా పౌరసత్వం లభించడానికి కొన్ని నెలల ముందు, ఆమె పేరును మళ్ళీ జాబితాలో చేర్చారని ఆరోపించారు. జనవరి 1, 1983ని అర్హత తేదీగా తీసుకున్నప్పటికీ, ఆమెకు పౌరసత్వం ఏప్రిల్ 30న వచ్చిందని, ఇది కూడా నిబంధనల ఉల్లంఘనే అని మాలవీయ వాదిస్తున్నారు.
ఈ విధంగా, భారత పౌరసత్వం లేకపోయినప్పటికీ రెండుసార్లు సోనియా గాంధీ పేరును ఓటర్ల జాబితాలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని బీజేపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
కాంగ్రెస్ ప్రతిస్పందన: బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే స్పందించింది.
అధికారులదే బాధ్యత: సోనియా గాంధీ తన పేరును ఓటరు జాబితాలో చేర్చమని ఎప్పుడూ దరఖాస్తు చేసుకోలేదని కాంగ్రెస్ ప్రతినిధి తారిఖ్ అన్వర్ తెలిపారు. అప్పటి ఎన్నికల సంఘం అధికారులే పొరపాటున ఆ పని చేసి ఉండవచ్చని ఆయన అన్నారు.
ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ: ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర, రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, అది తన సొంత నిర్ణయాలు తీసుకుంటుందని కాంగ్రెస్ పేర్కొంది. ఇప్పుడు కూడా ఎన్నికల సంఘం బీజేపీ ఒత్తిడుల నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా పనిచేయాలని డిమాండ్ చేసింది.


