Sunday, November 16, 2025
Homeనేషనల్Spy Cameras: మహిళా హాస్టల్ టాయిలెట్‌లో స్పై కెమెరా! 2 వేల మంది మహిళల తీవ్ర...

Spy Cameras: మహిళా హాస్టల్ టాయిలెట్‌లో స్పై కెమెరా! 2 వేల మంది మహిళల తీవ్ర ఆందోళన.. ఆ ఉద్యోగిని అరెస్ట్!

Krishnagiri : మహిళల గోప్యతకు భంగం కలిగించే అత్యంత భయానక ఘటన తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో వెలుగుచూసింది. కర్ణాటకకు సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో, ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ తమ ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న మహిళా వసతి గృహం (విదియల్ రెసిడెన్సీ) టాయిలెట్‌లో రహస్య స్పై కెమెరాలను గుర్తించడం తీవ్ర కలకలం సృష్టించింది.

- Advertisement -

గుట్టు రట్టు చేసిన అనుమానం:

ఒడిశాకు చెందిన ఉద్యోగిని, నీలుకుమారి గుప్తా (22) ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈమె హాస్టల్‌లోని ఒక టాయిలెట్‌లో రహస్యంగా కెమెరాను అమర్చి వీడియోలు చిత్రీకరిస్తుండగా, అదే గదిలో ఉంటున్న మరో మహిళా ఉద్యోగికి ఆమె కదలికలపై అనుమానం వచ్చింది. వెంటనే నిర్వాహకులకు సమాచారం ఇవ్వగా, సోదాల అనంతరం ఈ నీచమైన కుట్ర బట్టబయలైంది.

2 వేల మంది ఆందోళన:

ఈ విషయం బయటికి పొక్కగానే, ఆ హాస్టల్‌లో వసతి పొందుతున్న సుమారు రెండు వేల మందికి పైగా మహిళా ఉద్యోగులు రాత్రిపూట తీవ్ర ఆందోళనకు దిగారు. తమ గోప్యతకు భంగం కలిగించినందుకు న్యాయం చేయాలని, హాస్టల్ భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు కలెక్టర్, ఎస్పీతో సహా భారీగా పోలీసులు మోహరించాల్సి వచ్చింది.

పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు:

నిందితురాలు నీలుకుమారి గుప్తాను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో, ఆమె తన స్నేహితుడు, ప్రియుడు అయిన సంతోష్ (25) సూచనల మేరకు ఈ కెమెరాను అమర్చినట్లు తేలింది. సంతోష్‌ను కూడా బెంగళూరులో అరెస్టు చేశారు.కెమెరాలో ఒక వీడియో రికార్డయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలు ఈ ఫుటేజీని తన ప్రియుడికి పంపాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు మొత్తం హాస్టల్‌లోని ప్రతి గదిని, టాయిలెట్‌ను తనిఖీ చేయడానికి పది ప్రత్యేక మహిళా పోలీసు బృందాలను రంగంలోకి దించారు.

గోప్యతకు భంగం కలిగించిన ఈ ఘటనపై సదరు ప్రైవేట్ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరిన్ని వీడియోలు రికార్డు అయ్యాయా, ఈ కుట్రలో ఇంకెవరి ప్రమేయం ఉందనే దిశగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన 200 మందికి పైగా మహిళలు హాస్టల్ విడిచి స్వస్థలాలకు వెళ్లాలని నిర్ణయించుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad