Saturday, November 15, 2025
Homeనేషనల్DIWALI PLEA: "పిల్లల్ని పండగ చేసుకోనివ్వండి"... బాణసంచాపై సుప్రీంకోర్టుకు రాష్ట్రాల విజ్ఞప్తి!

DIWALI PLEA: “పిల్లల్ని పండగ చేసుకోనివ్వండి”… బాణసంచాపై సుప్రీంకోర్టుకు రాష్ట్రాల విజ్ఞప్తి!

States’ plea on firecracker ban : దీపావళి సమీపిస్తోంది.. కానీ, బాణసంచాపై నిషేధం నీలినీడలు కమ్ముకున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉండటంతో, టపాసులపై సంపూర్ణ నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై, పలు రాష్ట్ర ప్రభుత్వాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. “పిల్లలు పండగ కోసం ఎంతగానో ఎదురుచూస్తారు, దయచేసి వారిని పండగ చేసుకోనివ్వండి” అంటూ, కనీసం రెండు గంటల పాటైనా హరిత టపాసులు కాల్చుకునేందుకు అనుమతించాలని అభ్యర్థించాయి. అసలు ఈ వివాదం ఏంటి..? రాష్ట్రాల వాదనలో పస ఎంత..? దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి వైఖరి తీసుకోనుంది..?

- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో (NCR) వాయు కాలుష్యం ఏటా శీతాకాలంలో ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. దీనిని నియంత్రించేందుకు, సుప్రీంకోర్టు ఏప్రిల్ 3న ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోకి వచ్చే ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, హరియాణా రాష్ట్రాల్లో బాణసంచా తయారీ, విక్రయాలు, నిల్వలపై సంపూర్ణ నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టులో రాష్ట్రాల వాదన : ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ, పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట, రాష్ట్రాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.

రెండు గంటల అనుమతి: దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు, కేవలం రెండు గంటల పాటు పర్యావరణహితమైన (హరిత) బాణసంచా కాల్చడానికి అనుమతించాలని కోరారు.

షరతులతో కూడిన విక్రయాలు: కేవలం జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ (NEERI) ఆమోదించిన హరిత టపాసులను మాత్రమే తయారు చేసి, విక్రయించేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఆన్‌లైన్ అమ్మకాలపై నిషేధం: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లలో బాణసంచా అమ్మకాలను నిషేధిస్తామని తెలిపారు.

తీర్పు రిజర్వ్ : ఇరువర్గాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం, ఈ అంశంపై తన తీర్పును రిజర్వ్ చేసింది. కాలుష్య నియంత్రణ, ప్రజల మనోభావాల మధ్య సమతుల్యం పాటిస్తూ, సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గతంలోనూ కఠినంగానే : కాలుష్యం విషయంలో సుప్రీంకోర్టు గతంలోనూ అత్యంత కఠినంగా వ్యవహరించింది. నిషేధాన్ని ఉల్లంఘిస్తే, కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. పండగకు ముందే బాణసంచాను నిల్వ చేసుకుంటారని, కాబట్టి నిషేధం కఠినంగా అమలు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, రాష్ట్రాల విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందిస్తుందా, లేక నిషేధానికే మొగ్గు చూపుతుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad