Sukhvinder Singh Sukhu: హిమాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖు పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. అనేక పేర్లను పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం సుఖ్విందర్ సింగ్‌ను ఎంపిక చేసింది. హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎంపిక బాధ్యతను ఆ పార్టీ నేత ప్రియాంకా గాంధీ తీసుకున్నారు. పార్టీలో చర్చించి సుఖ్విందర్‌ను ఎంపిక చేశారు.
దీనికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ప్రకటించారు. రేపు (ఆదివారం) ఉదయం 11.00 గంటలకు సుఖ్విందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతోపాటు ముకేష్ అగ్నిహోత్రి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ముకేష్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజా ఎన్నికల్లో నాదౌన్ నియోజకవర్గం నుంచి గెలిచిన సుఖ్విందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడు.
40 ఏళ్లుగా ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. మాజీ ముఖ్యమత్రి వీరభద్ర సింగ్ వైఖరిని సుఖ్విందర్ నిరంతరం విమర్శించేవారు. గత మూడుసార్లు సుఖ్విందర్ సింగ్ వరుసగా తన నియోజకవర్గం నుంచి గెలుపొందారు. సుఖ్విందర్ సింగ్‌కు మాస్ లీడర్‌గా గుర్తింపు ఉంది. కార్యకర్తల్లోనూ ఆయనకు మంచి ఆదరణ ఉంది. సుఖ్విందర్ సింగ్ గెలిచిన నియోజకవర్గం హమీర్‌పూర్ పరిధిలో ఉంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సొంత నియోజకవర్గం కావడం విశేషం.
ఈ నియోజకవర్గం పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో నాలుగు కాంగ్రెస్ గెలుచుకుంది. మరో స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు. దీంతో ఈ నియోజకవర్గాన్ని ‘బీజేపీ ముక్త హమీర్‌పూర్’గా కాంగ్రెస్ అభివర్ణించింది. ఇక సీఎం రేసు కోసం పలువురు పోటీపడ్డారు. ప్రస్తుత పీసీసీ చీఫ్, మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ కూడా ఈ పదవి కోసం పోటీ పడ్డారు. అయితే, అందరినీ కాదని అధిష్టానం సుఖ్విందర్‌ను ఎంపిక చేసింది.