Emotional dependency in marriage : ఆర్థికంగా నిలదొక్కుకున్నంత మాత్రాన, జీవిత భాగస్వామితో భావోద్వేగ బంధం అవసరం లేదా..? వివాహ బంధంలో స్వతంత్రతకు, పరస్పర ఆధారపడటానికి మధ్య ఉన్న సున్నితమైన రేఖ ఏమిటి..? “నేను ఎవరి మీదా ఆధారపడను” అన్న ఓ భార్య వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం ఎందుకు అంత తీవ్రంగా స్పందించింది..? విడిపోవడానికి సిద్ధపడిన ఓ జంటకు వివాహం అసలు అర్థాన్ని ఎలా వివరించిందో వివరంగా చూద్దాం.
విచారణలో కీలక వ్యాఖ్యలు : విడాకుల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వివాహ బంధంపై కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం, పెళ్లి చేసుకున్నాక స్వతంత్రంగా ఉంటానని చెప్పడం అసంబద్ధమని కుండబద్దలు కొట్టింది. “వివాహం అంటే రెండు మనసుల కలయిక, ఇద్దరు వ్యక్తుల కలయిక. అలాంటప్పుడు భార్య లేదా భర్త ఎలా స్వతంత్రంగా ఉండగలరు? ఆధారపడకుండా ఉండాలనుకుంటే అసలు వివాహ బంధంలోకే అడుగుపెట్టకూడదు,” అని ధర్మాసనం హితవు పలికింది.
భార్య వాదన.. ధర్మాసనం స్పందన : సింగపూర్‌లో నివసిస్తున్న భర్తతో విడిపోయి, హైదరాబాద్‌లో ఉంటున్న భార్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. తన భర్త కేవలం పిల్లల సంరక్షణ హక్కుల కోసమే పోరాడుతున్నాడని, విడాకులకు ఒప్పుకోవడం లేదని ఆమె వాదించారు. ఈ క్రమంలో, “నాకు ఎవరిపైనా ఆధారపడటం ఇష్టం లేదు” అని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. “మీరు అలా చెప్పలేరు. ఆర్థికంగా మీరు అతనిపై ఆధారపడకపోవచ్చు. కానీ వివాహం చేసుకున్న తర్వాత భావోద్వేగపరంగా భర్తపై ఆధారపడక తప్పదు. భర్తపై ఆధారపడకూడదని ఏ భార్య చెప్పకూడదు. మీరిద్దరూ చదువుకున్నవారు. ఇలాంటి విషయాలను ఆలోచించి, సర్దుకుపోవాలి,” అని న్యాయస్థానం చురకలంటించింది.
పిల్లల భవిష్యత్తే ముఖ్యం : ఈ వాదోపవాదాల్లో పిల్లల భవిష్యత్తు నలిగిపోకూడదని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. “మీ పిల్లలు ఇంకా చిన్నవాళ్లు. మీరు కలిసుంటేనే వారు సంతోషంగా ఉంటారు. వారు ముక్కలైన ఇంటిని చూడకూడదు. అలా చూడటానికి వారు చేసిన తప్పేంటి? ప్రతి జంట మధ్య వివాదాలు సహజం, వాటిని సమన్వయంతో పరిష్కరించుకోవాలి,” అని సూచించింది.
కోర్టు ఆదేశాలు : భర్త తరఫు న్యాయవాది వాదిస్తూ, భార్యాభర్తలిద్దరికీ సింగపూర్‌లో మంచి ఉద్యోగాలున్నా, ఆమె తిరిగి రావడానికి నిరాకరిస్తోందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం, భార్యాబిడ్డల పోషణ కోసం రూ.5 లక్షలు డిపాజిట్ చేయాలని భర్తను ఆదేశించింది. ఆగస్టు 23న చిన్న కొడుకు పుట్టినరోజు సందర్భంగా, వేడుకల కోసం పిల్లలను తండ్రికి అప్పగించాలని భార్యను కోరింది. భార్యతో సయోధ్యకు సిద్ధంగా ఉన్నానన్న భర్త వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, తదుపరి విచారణను సెప్టెంబరు 16కి వాయిదా వేసింది.


