Delhi: ఢిల్లీ పరిధిలో వీధి కుక్కల తరలింపు చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు బహిర్గతం కాకముందే అధికారులు వీధి కుక్కలను పట్టుకోవడం ఎలా ప్రారంభించారని ధర్మాసనం నిలదీసింది. చట్టాలు ఉన్నా, వాటిని అమలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది అంటూ అధికారులు నిర్లక్ష్యంపై మండిపడింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ఈ అంశంపై విచారణ జరిపింది. ఆగస్టు 11న, ఢిల్లీలో పెరుగుతున్న కుక్కకాటు ఘటనలపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించి వీధి కుక్కలను షెల్టర్ హోమ్స్‌కు తరలించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై పలువురు జంతు హక్కుల కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, పలు పిటిషన్లు కోర్టు దృష్టికి వచ్చాయి. దీనితో కోర్టు ఈ అంశాన్ని మరింత విస్తృతంగా పరిశీలిస్తోంది.
Read more: https://teluguprabha.net/national-news/bsf-recruitment-2025-constable-tradesman-sports-quota/
ఢిల్లీ ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రజల ఆరోగ్యాన్ని ముందుంచారు. ఆయన మాట్లాడుతూ, “గతేడాది దేశవ్యాప్తంగా 37 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. చిన్నారులు చనిపోతున్నారు. రేబిస్ కేసులు పెరుగుతున్నాయి. స్టెరిలైజేషన్ మాత్రమే సరిపోదు. కుక్కలను చంపాల్సిన అవసరం లేదు కానీ, వాటిని వేరుగా ఉంచాలి” అని కోర్టుకు వివరించారు.
మరోవైపు, జంతు సంక్షేమ సంస్థల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ, ఢిల్లీలో తగినన్ని షెల్టర్ హోమ్స్ లేవు. ఈ సమయంలో ఈ తరలింపు ఉత్తర్వులు ఎలా అమలయ్యే అవకాశముంది?” అని ప్రశ్నించారు. ఆయన చర్చను మరింత తీవ్రంగా చేస్తూ, ఒకేచోట బంధించబడిన కుక్కలు ఒకదానిపై ఒకటి దాడి చేసి చనిపోయే ప్రమాదం ఉంది. ఇది తీవ్రమైన సమస్యకి దారితీస్తుంది అని వ్యాఖ్యానించారు. న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కూడా షెల్టర్‌లలో మౌలిక సదుపాయాల లేమి గురించి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
Read more: https://teluguprabha.net/national-news/12-devotees-killed-jammu-kashmir-cloud-burst/
వాదనలు పూర్తయ్యాక, ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, “ఒకవైపు ప్రజలు భయపడుతున్నారు, మరోవైపు జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఇది రెండు వర్గాలకు మధ్య సమతుల్యత అవసరమని చూపిస్తోంది. కానీ ఈ సంక్షోభానికి మూల కారణం అధికారుల వైఫల్యమే అని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేసును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు కోర్ట్ స్పష్టం చేసింది.


