PM Modi launches health schemein dhar: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 75వ పుట్టినరోజును పురస్కరించుకుని మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ధార్ జిల్లాలో ‘స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్’ (ఆరోగ్యవంతమైన మహిళ – శక్తివంతమైన కుటుంబం) అనే కొత్త పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. మహిళలు మరియు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 75 వేల ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.
భారత్ అణు బెదిరింపులకు భయపడదు: భారతదేశం యొక్క అణు శక్తి గురించి మోదీ ప్రస్తావించారు. భారత్ అణు బెదిరింపులకు భయపడదని అన్నారు. మన దేశం ఎవరికీ తలవంచదని తెలిపారు. మోదీ పుట్టినరోజు వేడుకలను బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పుట్టినరోజు పర్యటనలో భాగంగా మోదీ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు.. శుభాకాంక్షలు వెల్లువ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 75వ పుట్టినరోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కురిసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు సహా అనేక మంది ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ “మీ అసాధారణ నాయకత్వం, కృషితో దేశం గొప్ప లక్ష్యాలను సాధించింది. ప్రపంచం మొత్తం మీ మార్గదర్శకాలపై విశ్వాసం కలిగి ఉంది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, మీ నాయకత్వంలో దేశం పురోగతి సాధించాలని ప్రార్థిస్తున్నా” అని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ కూడా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ.. “మీ దార్శనిక నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై తన ముద్ర వేస్తోంది. అభివృద్ధి చెందిన దేశం అనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది” అని పేర్కొన్నారు.
అమిత్ షా ప్రశంసలు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాని మోదీని త్యాగం, అంకితభావానికి చిహ్నంగా అభివర్ణించారు. “కోట్లాది మంది దేశ ప్రజల ప్రేమను పొందుతోన్న ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఐదు దశాబ్దాలకు పైగా దేశ ప్రజల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ‘నేషన్ ఫస్ట్’ అనే మీ నినాదం ప్రతి పౌరుడికి ప్రేరణ” అని తెలిపారు.


