త్వరలోనే జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల పునర్‌విభజన జరగనున్న సంగతి తెలిసిందే. అయితే డీలిమిటేషన్ జరిగితే జనాభా తక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గుతుందని.. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాధి రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరుగుతుందనే అభిప్రాయాలు ఆందోళన రేపుతున్నాయి. దీనిపై దక్షిణాది రాష్ట్రాల నాయకులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తమ సీట్లు సంఖ్య తగ్గితే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. ముఖ్యంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోరాటానికి ఆయన సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే డీలిమిటేషన్ అంశంపై తమతో కలిసి పోరాడాలని ఏడు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. డీలిమిటేషన్‌కి వ్యతిరేకంగా జాయింట్ యక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలకు లేఖ రాశారు. మార్చి 22న చెన్నైలో జరిగే సంయుక్త కార్యాచరణ సమావేశానికి వారిని ఆహ్వానించారు.
అలాగే ఆయా రాష్ట్రాల విపక్ష నేతలను కూడా ఆహ్వానం పలుకుతూ లేఖలు పంపించారు. కేవలం రాజకీయ పార్టీలుగా కాకుండా ప్రజల భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఐక్యంగా కేంద్రంపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఎంతో కష్టపడి జనాభా నియంత్రణ చేపట్టిన రాష్ట్రాలకు పార్లమెంటులో హక్కులు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.