Uttarakhand floods and landslides : దేవభూమి ఉత్తరాఖండ్‌ను వరుణుడు వీడటం లేదు. కుండపోత వర్షాలకు కొండచరియలు పెను విపత్తును సృష్టిస్తున్నాయి. చమోలి జిల్లాలో బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడిన పెను విషాదంలో, అనేక ఇళ్లు నేలమట్టమవ్వగా, పది మంది గల్లంతయ్యారు. శిథిలాల కింద ఇంకా అనేక కుటుంబాలు చిక్కుకుని ఉంటాయన్న భయం, స్థానికులను, అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
బుధవారం రాత్రి కురిసిన కుండపోత వర్షాలకు, చమోలి జిల్లాలోని నందానగర్ ఘాట్ ప్రాంతం అతలాకుతలమైంది. కుంత్రి ఫాలి, దుర్మా గ్రామాలలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
ఈ ఘటనల్లో కుంత్రి ఫాలిలో ఎనిమిది మంది, దుర్మాలో ఇద్దరు గల్లంతయ్యారు. నందానగర్‌లోని కుంత్రి వార్డులో ఆరుకు పైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంకా అనేక ఇళ్లు, దుకాణాలు బురద, శిథిలాల కింద కూరుకుపోయాయి.
“రాత్రి కురిసిన వర్షాలకు 10-12 ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. ఏడుగురు చిక్కుకోగా, ఇద్దరిని కాపాడాం. మిగతా వారి కోసం గాలిస్తున్నాం. జేసీబీల సాయంతో రోడ్లను పునరుద్ధరిస్తున్నాం. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం.”
– సందీప్ తివారీ, జిల్లా మెజిస్ట్రేట్, చమోలి
కొనసాగుతున్న సహాయక చర్యలు : సమాచారం అందుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. అయితే, భారీగా పేరుకుపోయిన శిథిలాల కారణంగా, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న కొందరితో ఫోన్‌లో మాట్లాడగలుగుతున్నామని, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని స్థానికులు తెలిపారు.
వలస కార్మికుల మృతి : ఇదిలా ఉండగా, దెహ్రాదూన్‌లో కురుస్తున్న వర్షాలకు, ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఆరుగురు వలస కార్మికులు మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.
వైష్ణోదేవి యాత్ర పునఃప్రారంభం : మరోవైపు, ప్రతికూల వాతావరణం, కొండచరియల కారణంగా 22 రోజుల పాటు మూసివేసిన జమ్మూకశ్మీర్‌లోని ప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయాన్ని తిరిగి తెరిచారు. నవరాత్రులు సమీపిస్తుండటంతో, వాతావరణం కాస్త మెరుగుపడటంతో యాత్రను పునఃప్రారంభించారు. దీంతో, బంగంగ దర్షని గేట్ వద్ద వందలాది మంది భక్తులు దర్శనం కోసం క్యూ కట్టారు. ఆగస్టు 26న ఇక్కడ జరిగిన కొండచరియలు విరిగిపడిన ఘటనలో 34 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.


