Vande Mataram Anthem Turns 150: స్వాతంత్య్ర పోరాట సమయంలో కోట్లాది మంది భారతీయులలో దేశభక్తిని, స్ఫూర్తిని నింపిన మన జాతీయ గేయం ‘వందేమాతరం’ నేటితో 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా స్మారక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించడానికి దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ స్మారక కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవానికి గుర్తుగా ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను, అలాగే ఒక నాణెంను కూడా ఆవిష్కరించారు. ఈ స్మారక ఉత్సవాలు నవంబర్ 7, 2025 నుండి నవంబర్ 7, 2026 వరకు దేశవ్యాప్తంగా జరుగనున్నాయి.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వందేమాతరం కేవలం ఒక పదం మాత్రమే కాదని, అది ఒక శక్తివంతమైన సంకల్పం అని పేర్కొన్నారు. ఇది భారతమాత పట్ల భక్తి, ఆరాధనను ప్రతిబింబించే పదాలని ఆయన అన్నారు. వందేమాతరం పదాలు మనల్ని చరిత్రలోకి తీసుకువెళ్లడమే కాక, మన వర్తమానాన్ని కొత్త ఆత్మవిశ్వాసంతో నింపుతాయని తెలిపారు. వందేమాతరం అనేది సాధించలేని సంకల్పం లేదు, భారతీయులు నెరవేర్చలేని లక్ష్యం లేదు అని మన భవిష్యత్తుకు ధైర్యాన్ని ఇచ్చే సరస్వతి దేవి ప్రార్థన వంటిదని ప్రధాని మోదీ ప్రసంగించారు.
‘వందేమాతరం’ గేయాన్ని బంకించంద్ర ఛటర్జీ నవంబరు 7, 1875న రచించారు. ఈ గీతం తొలిసారిగా ఆయన రాసిన సుప్రసిద్ధ నవల ‘ఆనందమఠ్’లో ప్రచురితమైంది. ఈ గీతం 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు గొప్ప ఉద్యమ రూపం దాల్చింది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి అయినప్పటికీ, ఆంగ్లేయుల నిర్ణయానికి వ్యతిరేకంగా కోల్‌కతా ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడారు. రవీంద్రనాథ్ ఠాగూర్ నేతృత్వంలో స్వదేశీ ఉద్యమం మొదలైంది. ఈ సమయంలోనే ‘వందేమాతరం’ గీతం దేశమాత స్మరణకు గుర్తుగా ఆలపించబడింది.
బెంగాలీ విప్లవకారులు ఈ ‘వందేమాతరం’ నినాదాన్ని, గేయాన్ని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించారు. వారు దీన్ని వివిధ భాషల్లోకి అనువదించి కరపత్రాలుగా పంచారు. విప్లవకారుల ముఖ్య నేత అరవింద్ ఘోష్ ఈ గీతాన్ని మొదటిసారిగా ఇంగ్లీషులోకి అనువదించారు. 1905-1911 మధ్య కాలాన్ని భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో ‘వందేమాతర యుగం’గా చరిత్రకారులు అభివర్ణించారు. బ్రిటిష్ పాలకులు దీని తీవ్రతను గుర్తించి గేయంపై నిషేధం విధించినా, ఆ నిర్ణయం భారతీయుల్లో మరింత ఆగ్రహాన్ని, పోరాటస్ఫూర్తిని పెంచిందని చరిత్ర చెబుతోంది. అందుకే ఈ గేయం యొక్క 150 ఏళ్ల వేడుకలు దేశీయ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచే విధంగా ఉండాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.


