Saturday, November 15, 2025
Homeనేషనల్Vice President Election : ఉపరాష్ట్రపతి పీఠంపై ఉత్కంఠ - ఎన్నికల షెడ్యూల్‌ విడుదల!

Vice President Election : ఉపరాష్ట్రపతి పీఠంపై ఉత్కంఠ – ఎన్నికల షెడ్యూల్‌ విడుదల!

Vice President of India election schedule : మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ అనూహ్య రాజీనామాతో ఖాళీ అయిన దేశ రెండవ అత్యున్నత పీఠానికి ఎన్నికల నగారా మోగింది. పదవీకాలం మరో రెండేళ్లు ఉన్నప్పటికీ ఆయన హఠాత్తుగా వైదొలగడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే అభ్యర్థి ఎవరు..? విపక్షాల వ్యూహం ఏంటి? ఈ ఉత్కంఠ నడుమ, భారత ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. 

- Advertisement -

సెప్టెంబర్ 9న పోలింగ్, అదే రోజు ఫలితం : దేశ తదుపరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్‌ను ప్రకటించింది. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ రాజీనామా నేపథ్యంలో ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. సెప్టెంబర్‌ 9వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని వెల్లడించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.

ఎన్నికల షెడ్యూల్ వివరాలివే…
నోటిఫికేషన్‌ విడుదల: ఆగస్టు 7
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: ఆగస్టు 21
నామినేషన్ల పరిశీలన: ఆగస్టు 22
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: ఆగస్టు 25
పోలింగ్ తేదీ: సెప్టెంబర్ 9 (ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు)
ఓట్ల లెక్కింపు, ఫలితం: సెప్టెంబర్ 9

ఎన్నికల ప్రక్రియ, అధికారులు : ఈ కీలక ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్‌ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పి.సి. మోదీ వ్యవహరించనున్నారు. ఆయనకు సహాయకులుగా రాజ్యసభ సెక్రటేరియట్‌ అధికారులు గరిమా జైన్, విజయ్‌ కుమార్‌ ఉంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీ జాబితా కూడా ఖరారైనట్లు ఈసీ ప్రకటించింది.

అభ్యర్థులపై ఆసక్తి.. రాజకీయ సమీకరణాలు : షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పుడు అందరి దృష్టి అభ్యర్థులపై పడింది. అధికార ఎన్డీయే కూటమి తరఫున ఎవరు బరిలో దిగుతారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. జేడీయూ నేత, కేంద్రమంత్రి రామ్‌నాథ్‌ ఠాకూర్‌ పేరు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, బీజేపీకి చెందిన నేతనే ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుంటామని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, విపక్షాలు కూడా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు కసరత్తు చేస్తున్నాయి.

ధన్‌ఖడ్‌ అనూహ్య రాజీనామా : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే జగదీప్ ధన్‌ఖడ్‌ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరో రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉండగానే, అనారోగ్య కారణాలను చూపుతూ ఆయన పదవి నుంచి వైదొలిగారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించడంతో, ఉపరాష్ట్రపతి పీఠం ఖాళీ అయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad