West Bengal: ఒకపక్క మన ఇండియా అభివృద్ధి చెందుతుందని మన నేతలు ఘనంగా చెప్పుకుంటున్నా.. అప్పుడప్పుడు కొన్ని సిగ్గుచేటు సంఘటనలు మనల్ని వెక్కిరిసిస్తూనే ఉన్నాయి. అలాంటి ఘటనే ఇది. బీజేపీ నేతలు దుప్పట్లు పంపిణీ చేస్తున్నాం అనగానే పేదలంతా వాటికోసం ఎగబడడంతో తొక్కిసలాట జరిగి ఏకంగా ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. పశ్చిమబెంగాల్ బర్దవాన్‌లో బుధవారం దుప్పట్ల పంపిణీలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు గాయపడ్డారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత సువేందు అధికారి ముఖ్య అతిధిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సువేందు కార్యక్రమాన్ని ప్రారంభించి అలా పక్కకి రాగానే దుప్పట్ల కోసం ఒక్కసారిగా ప్రజలు ఎగబడ్డారు. అనుకున్నదానికంటే ఎక్కువ మంది రావడంతో ఈ ప్రమాదం జరిగిందని బీజేపీ నేతలు చెబుతుండగా ఈ కార్యక్రమానికి బీజేపీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని అధికార టీఎంసీ ఆరోపించింది.
ఓ చిన్న చిన్నవేడుకను మొదలుపెట్టి.. దానికోసం సామర్థానికి మించి ఎక్కువ మందిని తరలించారని.. ఆపై దుప్పట్ల పంపిణీ మొదలు పెట్టారని.. అందుకే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. నిబంధనలు పాటించని సువేందు అధికారి తీరుపై విమర్శలు గుప్పించింది. మొత్తంగా ఈ ప్రమాదానికి మీరు కారణమంటే మీరు కారణమని అధికార, ప్రతిపక్షాలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే.. అసలు దుప్పట్ల కోసం ప్రాణాలకు తెగించి పొరాడేంత పేదరికంపై మాత్రం ఎవరు మాట్లాడరు.