కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో అత్యంత శక్తిమంతులైన నేతల్లో ఒకరు.. నితిన్ గడ్కరీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా తరువాత ఆ స్థాయిలో ఛరిష్మా ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉంది. మోదీ తరువాత ప్రధానమంత్రి పదవిని చేపట్టే అర్హత ఉన్న ఏకైక నాయకుడు ఆయనేనని చెబుతుంటారు. ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖను నితిన్ గడ్కరీ అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తోన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటైన 2014 నుంచీ అదే శాఖను పర్యవేక్షిస్తోన్నారు. మోదీ 3.0 కేబినెట్‌లోనూ అదే శాఖ లభించడం ఆయన సామర్థ్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఓ మధ్యస్థాయి పట్టణానికీ జాతీయ రహదారులతో అనుసంధానించగలిగారు. అద్భుతమైన రోడ్ కనెక్టవిటీని కల్పించగలిగారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్‌లో భాగంగా పలు నగరాల మధ్య ఎక్స్‌ప్రెస్ వే, రోడ్ కారిడార్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ-ముంబై, ముంబై-నాగ్‌పూర్, బెంగళూరు- చెన్నై, బెంగళూరు- మైసూరు, బెంగళూరు- విజయవాడ, ఢిల్లీ-అమృత్‌సర్-కాట్రా, రాయ్‌పూర్- విశాఖపట్నం వంటి అనేక ఎక్స్‌ప్రెస్‌లు ఆయన హయాంలోనే కార్యరూపం దాల్చాయి. అలాంటి నితిన్ గడ్కరీని ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయంగా భావిస్తూ వచ్చారు చాలామంది. అటు ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా బ్లాక్ సైతం అదే భావించింది. బీజేపీ నుంచి బయటికి వచ్చి తమ కూటమికి గనక మద్దతు ఇవ్వగలిగితే ప్రధానమంత్రిని చేస్తామనే హామీని సైతం ఇఛ్చాయి. ఈ విషయాన్ని నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలు తనను సంప్రదించినట్లు చెప్పారు. ఇండియా బ్లాక్‌కు మద్దతు ఇవ్వాలని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానమంత్రిని చేస్తామంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓ సీనియర్ నాయకుడు తనతో మంతనాలు సాగించారని అన్నారు. నాగ్‌పూర్‌లో నిర్వహించిన అనిల్ కుమార్ పత్రకారిత పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. జర్నలిజంలో అత్యున్నత ప్రతిభను కనపర్చిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్ట్ వివేక్ దేశ్‌పాండే, టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ జర్నలిస్ట్ రాము భగవత్, లోక్‌మత్ విదర్భ ఎడిటర్ శ్రీమత్ మానె, లోక్‌సత్తా పాత్రికేయుడు రామ్ భాక్రేకు ఈ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమకు మద్దతు ఇస్తే ప్రధానమంత్రిని చేస్తామంటూ ఆఫర్ చేసిన ఈ ప్రతిపక్ష నాయకుడి పేరును వెల్లడించదలచుకోలేదని నితిన్ గడ్కరీ అన్నారు. ఆ ఆఫర్‌ను తాను తిరస్కరించానని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కావడం అనేది తన జీవిత లక్ష్యం కాదని చెప్పారు. తనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించడానికే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు.
Gadkari the next PM?: గడ్కరీకి ప్రధాని పదవి ఆఫర్
మోదీ తరువాత ప్రధాని అర్హత ఉన్న ఏకైక నాయకుడు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES