Friday, November 22, 2024
HomeNews38 parties: ఉమ్మడి అభ్యర్థుల కోసం 38 పార్టీల పీకులాట

38 parties: ఉమ్మడి అభ్యర్థుల కోసం 38 పార్టీల పీకులాట

జట్టు కట్టారు, మరి ఉమ్మడి అభ్యర్థులను బరిలో దించటం ఏమాత్రం సాధ్యం?

హమ్మయ్య ఎట్టకేలకు తమకున్న సంఖ్యా బలం 38 పార్టీలంటూ లెక్క తేల్చి, విపక్షాలకు గట్టి హెచ్చరికలైతే ప్రస్తుతానికి ఇచ్చింది బీజేపీ.  కానీ ఇల్లు అలకగానే పండుగ కాదు కదా.  38 పార్టీల కూటమే ఎన్డీఏ అంటూ ఘనంగా ప్రకటన చేసినప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టడం అసలు సవాలుగా మారనుందనే విషయం కమలనాథులకు బాగా తెలుసు.

- Advertisement -

వాజ్ పేయి హయాంలో ఎన్డీఏ కూటమిలో కేవలం 24 పార్టీలుండగా మోడీ హయాంలో దాన్ని 38 పార్టీలకు పెంచటం మరో విశేషం.  కానీ వీటికున్న సంఖ్యా బలం, ప్రజాదరణ అన్న విషయాలు ఇక్కడ అప్రస్తుతంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఎన్డీఏ అభ్యర్థుల ఖరారు విషయానికి వస్తే బిహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమికి అంగీకారమైన అభ్యర్థిని నిలపటం అంత ఈజీ కానేకాదు.   ఉదాహరణకు బిహార్ రాష్ట్రాన్నే తీసుకుంటే అత్యధిక స్థానాల్లో పోటీ చేసే వ్యూహంలో బీజేపీ ఉండగా రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ తనకు 2019లో లానే 6 లోక్ సభ, ఒక రాజ్యసభ స్థానం కోసం పట్టుబడుతున్నారు. ఇక చిరాగ్ బాబాయ్ పశుపతి పరాస్ వేరు కుంపటి పెట్టినా, ఎన్డీఏలోనే భాగం, ఆయన కూడా ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తున్నారు, మరోవైపు సామాజిక సమీకరణాల రీత్యా చూస్తే ఎన్డీఏ కూటమిలోనే భాగమైన జితిన్ రాం మంఝి, ఉపేంద్ర కుశ్వహాలది కూడా సేమ్ డిమాండ్.  మరి వీరందరికీ ఆమోద యోగ్యమైన ఫార్ములా బీజేపీ తేవటం అసాధ్యంగా మారింది.  అలాంటప్పుడు వీరు ఉమ్మడి అభ్యర్థిని నిలపటం, అందరి ఓట్లు ఒకే అభ్యర్థికి పడేలా చేయగలరా అన్నది అసలు సందేహం,

ఇలాంటి పరిస్థితే ఇటు మహారాష్ట్రాలలోనూ ఉంది.  సొంత అభ్యర్థులను నిలుపుతూనే, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం, శివసేన షిండే వర్గంకు కూడా టికెట్లు కేటాయించటం అంటే కత్తి మీద సాము వంటిదే.  ఉత్తర్ ప్రదేశ్ లోనూ సేమ్ సీన్, అప్నా దళ్, నిషాద్ పార్టీ, ఓపీ రాజ్భర్ బీఎస్పీ పార్టీలకు చెందిన అభ్యర్థులను సంతృప్తి పరిచేలా టికెట్లు కేటాయించాలి.  ఒకవేళ ఆర్ఎల్డీ బీజేపీతో చేతులు కలిపితే వారికి సీట్లు ఇవ్వటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.  తమిళనాడు, కేరళ, హర్యానా, జార్ఖండ్ వంటి అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే సమస్య. మరోవైపు తమిళనాడు నుంచి లోక్ సభ బరిలో దిగేందుకు ప్రధాని మోడీ యోచిస్తున్నారు.  ఇక్కడి నుంచి మోడీ పోటీచేస్తే దాని ప్రభావం అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా పడి, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తమ సంఖ్యా బలం మరింత పెరిగే అవకాశాలుంటాయనే లెక్కల్లో ఉన్నారు బీజేపీ పెద్దలు.  రామనాథపురం నుంచి మోడీ బరిలోకి దిగే  అవకాశాలున్నాయనే రూమర్ రావటంతో ఇప్పుడు అందరూ తమిళనాడు లోక్ సభ అభ్యర్థులపై ఫోకస్ చేయటం మొదలు పెట్టారు.  మోడీ బయటి వాడు అనే ముద్రను దక్షిణాదిలో చెరిపేసేందుకు  ఇది మంచి ఆయుధంలా పనిచేస్తుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చెబుతున్న వివరణ ఆసక్తిగానే ఉంది.  మరోవైపు బీజేపీది ఉత్తరాది పార్టీ అనే భావన నుంచి బయటకు లాక్కొచ్చే ప్రయత్నం కూడానూ.  వదోదర, వారణాసి తరువాత స్థానం రామనాథపురంకు దక్కే అవకాశాలు ప్రస్తుతానికి చాలానే ఉన్నాయన్నమాట. అందుకే గత కొన్నేళ్లుగా మోడీ పదేపదే తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.  గతంలో ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు కూడా దక్షిణాది నుంచి పోటీ చేసి విజయం సాధించారు.  అచ్చం ఇదే రూట్ లో ఇప్పుడు మోడీ కూడా పయనించేలా యోచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News