ప్రభాస్ – కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ మూవీ మరింత వివాదాల్లోకి చేరుతుంది. ఎన్నో అంచనాల నడుమ (జూన్ 16) న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదిపురుష్ చిత్రానికి అన్ని చోట్ల మిశ్రమ టాక్ నడుస్తుంది. ట్రైలర్ చూసి సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని వెళ్తే..డైరెక్టర్ ఓం తీవ్ర నిరాశకు గురిచేసాడని అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు రామాయణ కథను మరింత దారుణంగా చూపించారని , సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని కించపరిచేలా డైరెక్టర్ ఓం తెరకెక్కించారని హిందూ సంఘాలతో పాటు సోషల్‌మీడియాలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.
నిన్నటి వరకు సోషల్ మీడియా వరకే ఈ వివాదం కొనసాగగా..ఇప్పుడు థియేటర్స్ వద్దకు చేరింది. ఎక్కడిక్కడే సినిమా ప్రదర్శన జరుగుతున్న థియేటర్స్ వద్దకు పెద్ద ఎత్తున హిందూ సంఘాలు వచ్చి సినిమాను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ టెన్షన్ మరింత పెరుగుతుంది. ఇప్పటికే సినిమాకు నెగిటివ్ టాక్ వస్తుండగా..ఇప్పుడు సినిమా ప్రదర్శనను అడ్డుకోవడం వారిని ఆందోళన కలిగిస్తుంది.
తనకు ప్రాణహాని ఉందంటూ సినిమాకు డైలాగులు రాసిన మనోజ్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనకు భద్రతను కల్పించాలని కోరారు. ఆయన భద్రతను కోరిన వెంటనే పోలీసు అధికారులు స్పందించారు. మనోజ్ కు భద్రతను కల్పించారు. పరిస్థితిని తాము పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు.