సెక్స్ టాయ్ ఒకప్పుడు ఇదంటేనే ముఖం చిట్లించుకునే భారతీయులు ఇప్పుడు క్రమంగా వీటికి అలవాటు పడుతున్నారు. 2024 నుంచే ఇవి క్రమంగా బయటకు రావడం మొదలైంది. ఇటీవలి కాలంలో చాలామంది సెక్స్ ఎడ్యుకేటర్లు, వెల్‌నెస్ ఇన్‌ఫ్లూయెన్సర్లు పెరగడం, తమ తమ యూట్యూబ్ ఛానళ్లలో గానీ, ఇన్‌స్టా రీళ్లలో గానీ వీటి గురించి శాస్త్రీయంగా వివరించి చెప్పడంతో ఇన్నాళ్లూ వీటి గురించి ఉన్న అపోహలు కొంతవరకు దూరమయ్యాయి.
క్విక్ మార్ట్స్ తో ఈజీ
దానికి తోడు ఏదైనా కావాలని ఆర్డర్ పెడితే పావుగంటలోనే తెచ్చిచ్చే స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్, జెప్టో, బ్లింకిట్ లాంటివి ఉండడంతో ఈ టాయ్స్ మరింతగా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా బెడ్రూంలో అవసరాల గురించి మై మ్యూజ్ అనే సంస్థ లైడ్ ఇన్ ఇండియా పేరుతో నిర్వహించిన సర్వేలో సుమారు 10వేల మందికి పైగా పాల్గొన్నారు. వాళ్లలో 45% మంది తాము సెక్స్ టాయ్స్ వాడుతున్నట్లు చెప్పారు. వీటి గురించి తమ స్నేహితులతో బహిరంగంగా చర్చిస్తున్నట్లు చెప్పినవారు 78% మంది ఉన్నారు. అందులోనూ పురుషుల కంటే మహిళలే వీటివైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. సెక్స్ టాయ్‌లు వాడక ముందుకంటే, ఆ తర్వాత తమకు భావప్రాప్తి (ఆర్గాజం) బాగుందని మై మ్యూజ్ సర్వేలో పాల్గొన్న మహిళలు బహిరంగంగా చెప్పారట! నిజానికి ఎప్పటినుంచో పురుషుల కంటే మహిళలే ఇలాంటి విషయాల్లో, కొనుగోళ్లలో కొంత ముందంజలో ఉన్నారని లవ్ డిపో బిజినెస్ విభాగాధిపతి అర్జున్ శివ చెబుతున్నారు.

మారుతున్న మహిళా సమాజం
మన దేశంలో నిజానికి మహిళలు తమ సంతృప్తి గురించి బయటకు చెప్పడానికి చాలాకాలమే పట్టింది. ముఖ్యంగా సమాజంలో మహిళల హక్కుల పట్ల మారుతూ వచ్చిన భావనల వల్ల ఇప్పుడైనా ఇది బయట పడింది. అప్పటివరకు తాము పడకగదిలో సంతృప్తి చెందినా, చెందకపోయినా బయటకు చెప్పుకోలేక తమలో తామే బాధపడేవారు. అయితే, క్రమంగా మహిళలు కూడా సంపాదించడం మొదలైంది. ఆ తర్వాతి నుంచి వాళ్లు తమ హక్కుల గురించి బయటకు మాట్లాడడం ప్రారంభించారు. ఆ తదుపరి క్రమంలో సెక్స్ గురించి, అందులో తమ భావప్రాప్తి గురించి కూడా మాట్లాడసాగారు. లీజా మంగళ్‌దాస్ లాంటి వాళ్లు అయితే సెక్స్ ఎడ్యుకేటర్లుగా కూడా మారారు. ఆమె అభిప్రాయంలో చెప్పాలంటే “సాధారణంగా సెక్సువల్ వెల్‌నెస్ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో మహిళలు ఎలాంటి జంకు లేకుండా ముందుకు వస్తుంటే, పురుషులకు మాత్రం ఇప్పటికీ అనేక అడ్డంకులు ఉంటున్నాయి. గట్టిగా మాట్లాడితే మందుల షాపుకు వెళ్లి కండోమ్ కావాలని పది మంది ముందు అడగగలిగే ధైర్యం కూడా చాలామంది మగవాళ్లకు ఉండదు. పురుషాధిక్య సమాజం ఉన్నన్నాళ్లు మహిళలు కూడా గడపచాటునే ఉండిపోయేవారు. అందువల్ల నిజానికి పురుషుల కంటే మహిళలకే సెక్స్‌పరమైన సంతృప్తిని కలిగించే బొమ్మలు, ఇతర ఉత్పత్తుల కొనుగోలు కొంత కష్టం కావాలి. కానీ ఇప్పుడు పరిస్థితి బాగా మారింది. ఆన్‌లైన్ కొనుగోళ్లు రావడం ముందుగా మహిళలను, ఆ తర్వాత పురుషులను ఈ బంధనాల్లోంచి కొంతవరకు బయటకు తీసుకొచ్చాయి. ఒకవేళ భాగస్వామి తన కోసం సెక్స్ టాయ్ తెచ్చినా కూడా దాన్ని సంతోషంగా స్వీకరించేందుకు భారతీయ మహిళలు ముందుకొస్తున్నారు. కానీ చాలా సందర్భాల్లో మాత్రం మహిళలు ఎంత సంతృప్తి చెందుతున్నారన్న విషయాన్ని మగవాళ్లు పట్టించుకోవట్లేదు. ఆ రెండు-మూడు నిమిషాలు పని కానించేసుకుని పక్కకు తిరిగి పడుకుంటున్నారు. ఒక రకంగా అందుకే సెక్స్ టాయ్స్ వ్యాపారంలో మహిళలకు కావల్సిన బొమ్మల మార్కెట్ వాటా ఎక్కువగా ఉంది” అని ఆమె చెప్పారు.
మగవాళ్ల తీరు ఇలా
పురుషుల్లో చాలామందికి ఇప్పటికీ ఒక రకమైన జంకు, సమాజం ఏమంటుందోనన్న భయం, చుట్టూ చూసుకోవడం, సెక్స్ టాయ్‌లను ఉపయోగించడం తప్పు అవుతుందేమోననే అనుమానాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. పితృస్వామ్య సమాజం వల్లే ఇలా ఎక్కువగా జరుగుతోంది. చాలా సందర్భాల్లో మహిళను సంతృప్తి పరచడానికి సెక్స్ టాయ్ లేదా ఇతర మరేవైనా పరికరాలు వాడుతున్నారంటే, అలాంటి మగవాళ్లను అసమర్థులుగా ముద్రవేసే అలవాటు మన సమాజంలో ఉంది. అందుకే ఇప్పటికీ చాలామంది పురుషులు వీటి కొనుగోళ్లు, వాడకానికి వెనకాడుతూనే ఉన్నారు. మహిళలు సెక్స్ టాయ్స్ వాడుతున్నారంటే అది పూర్తిగా వారి భావప్రాప్తి కోసమే. అదే మగవారైతే మాత్రం మహిళలను సంతృప్తిపరచడానికి అనే భావన ఇప్పటికీ వారిని వేధిస్తోంది.

క్రమంగా వీడుతున్న మబ్బులు
“నాకు దాదాపు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. నా భార్యతో శృంగారంలో పాల్గొనేటప్పుడు సెక్స్ టాయ్స్ వాడడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ, స్వయంతృప్తికి మాత్రం వాటి అవసరం నాకు పెద్దగా కనిపించడం లేదు. పురుషులకు భావప్రాప్తి చాలా సులభంగా వస్తుంది. అందువల్ల మాలో చాలామంది ఒక్కరే చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించరు. అదే మహిళలకు మాత్రం భావప్రాప్తి అంత త్వరగా రాకపోవచ్చు. అందుకే వాళ్లు ఎక్కువగా వాడుతుంటారు, కొంటుంటారు” అని ఢిల్లీకి చెందిన 35 ఏళ్ల మార్కెటింగ్ వృత్తి నిపుణుడు చెప్పారు.
తూఫాన్ లాంటి ఉత్పత్తులకు డిమాండు కొంత వరకు బాగుంటోంది. ఇన్నాళ్లూ కేవలం మహిళల ఉత్పత్తులకే మార్కెట్ బాగుండగా, ఇప్పుడు క్రమంగా పురుషుల ఉత్పత్తులూ అమ్ముడుపోతున్నాయి. బహుశా ఒకటి రెండేళ్లు అయ్యేసరికి ఇవి కూడా బాగానే వస్తాయి. వీరికి సంబంధించిన ఉత్పత్తుల డిజైన్లు కూడా ఇప్పుడు సరికొత్తగా రావడం, అవి వారికి సురక్షితంగానూ, సుఖంగాను అనిపించడం వల్లే వాళ్లు కొంతవరకు మొగ్గు చూపిస్తున్నారు. స్ట్రోకర్ స్లీవ్స్, వైబ్రేటింగ్ రింగ్స్, యాప్ ఆధారిత పరికరాలకు డిమాండ్ క్రమంగా ఎక్కువవుతోంది.
ఇద్దరూ కలిసి వాడేవి కూడా
ఇంతకాలం చాలావరకు పురుషులు, మహిళలు వేర్వేరుగా ఉపయోగించే సెక్స్ టాయ్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా శృంగార సమయంలో ఇద్దరూ కలిసి ఉపయోగించే ఉత్పత్తులూ వస్తున్నాయి. ఇవి ఉపయోగించినప్పుడు మహిళలకు మరింత మెరుగైన భావప్రాప్తి వస్తోంది. ఇవి వాడడం వల్ల తమ భాగస్వాములతో సంబంధాలు ఇంతకు ముందు కంటే చాలా బాగున్నాయని, రోజువారీ జీవితంలో కూడా తమ భార్యలు బాగా సహకరిస్తున్నారని లైడ్ ఇన్ ఇండియా సర్వేలో పాల్గొన్నవారిలో 31% మంది చెప్పడం విశేషం. ఇప్పుడు క్రమంగా పురుషులే వెళ్లి తమకోసం, తమ భార్యల కోసం ఈ ఉత్పత్తులు కొంటున్నారు. పైగా ఈరోజుల్లో వేటికీ బయటకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడం, దాదాపుగా అన్నీ ఆన్‌లైన్‌లోనే లభ్యం కావడం వారికి మరో పెద్ద వెసులుబాటుగా మారింది.
(తెలుగుప్రభ ప్రత్యేక ప్రతినిధి)