కెనడాలోని కాల్గరీలో హిందూ హెరిటేజ్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు సాగాయి. వినాయక నవరాత్రుల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.
కాల్గరీ కెనడాలో శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ, శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్తలు లలిత ద్వివేదుల, శైలేష్ భాగవతుల ఆధ్వర్యంలో గణపతి ఊరేగింపు వేడుకలు కాల్గరీ నగర డౌన్ టౌన్ వీధులలో కన్నుల పండుగగా నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు రాజ్‌కుమార్ శర్మ మందిరంలో ప్రతిరోజు గణపతి అభిషేకము, అర్చన, గణపతి హోమము, హారతులు నిర్వహించారు. గణపతి నవరాత్రి ఊరేగింపు సంబరాల నిర్వహిణకు చాలామంది వాలంటీర్లు, వ్యాపార యజమానులు తమ ప్రత్యేక సహాయాన్ని అందించటం విశేషం.
నగర వీధుల్లో గణపతి ఊరేగింపు కోసం హెచ్&హెచ్ డెకర్స్, హేమ, హర్షిణి ట్రక్ ను ఎంతో అందంగా అలంకరించారు. గణనాధుని యాత్రకు కాల్గరీ ఎమ్మెల్యే పీటర్ సింగ్ విచ్చేశారు. ఊరేగింపులో పాల్గొన్న భక్తులను, ప్రజలను ఉద్దేశించి కాల్గరీ నగరంలో ఇటువంటి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు శ్రీ అనఘా దత్త యజమాన్యం వారిని ప్రశంసించారు. మరిన్ని భారతీయ సంప్రదాయాన్ని చాటిచెప్పే ఇటువంటి కార్యక్రమలను అల్బెర్టా ప్రావిన్స్ కల్చర్ డేస్ ను పురస్కరించుకుని భారతీయ శాస్త్రీయ కళలు, నృత్య కచేరీలు, హిందూ వారసత్వ వేడుకలు జరుపుతున్నందుకు లలిత మరియు శైలేష్ ను ఎంతో అభినందించారు.
గణపతి ఉరేగింపును అర్చకులు రాజ్ కుమార్ గణపతి తాళం, అర్చన, హారతితో ప్రారంభించగా భక్తులు శ్రీ గణేష్ మహరాజ్ కి జై అనే నినాదాలతో యాత్ర కొనసాగింది. లోహిత్, ఓం సాయి మరియు ఫణి భజనలతో, పాటలతో గణపతిని స్తుతించారు.
కాల్గరీ సిటీ మునిసిపల్ హాల్ వద్ద మొదలైన గణపతి ఊరేగింపు షా మిలీనియం పార్క్ చేరుకునే వరకు సుమారు 500 మందికి పైగా భక్తులు ఆనందంతో నాట్యం చేస్తూ గణపతి నామ సంకీర్తన చేశారు. ఉత్తర అమెరికా ఖండంలో ఇటువంటి వేడుకలు జరపడం కష్టమైనప్పటికీ శ్రీ అనఘా దత్తా సొసైటీ ఆఫ్ కాల్గరీ యాజమాన్యం, సభ్యులు ఎన్నో దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, రానున్న భావితరాలకి భారత సంప్రదాయ పూలబాటలు వేస్తున్నారని అందరూ ప్రశంసించారు.
కెనడా లో హిందూ వారసత్వ వేడుకల్లో నిర్వహించిన వయోలిన్ కచేరీ లో కెనడాలో, యూఎస్ఏలో ఉన్న విద్వాంసులైన srimathi Aarathi shankar, Srimati Anjana Srinivasan వయోలిన్ వాయించగా, ఆదిత్య నారాయణ్ మృదంగంతో, రమణ ఇంద్ర కుమార్, ఘటంతో, రత్తన్ సిద్ధు తంబురాలతో సహకరించారు. విద్వాంసులందరిని అనఘా దత్త సంఘం అధ్యక్షురాలు లలిత బహుమతులతో ఘనంగా సత్కరించారు.
అక్టోబర్ మాసంలో రానున్న దేవి నవరాత్రి ఉత్సవాలకి లలిత, స్వచ్ఛంద సేవకులైన శోభన నాయర్, మాధవి చల్లా, మాధవి నిట్టల, కళైజ్ఞర్ సంతానం, అర్చకులు రాజ్‌కుమార్ సన్నహాలు జరుపుతున్నారు. శ్రీ అనఘా దత్త సంఘంవారు నిర్వహించే దేవి నవరాత్రి వేడుకలతో, కొన్నివేల మంది భక్త జనం ఈ పూజల్లో పాల్గొనేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. అనఘా అమ్మవారి వేడుకలతో కెనడాలో కాల్గరీ నగరం ‘కాళిగిరిగా మారుతుందని భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.
ఈ వేడుకల్లో 800 మందికి పైగా పాల్గొని ఈ వేడుకలు జయప్రదం చేశారు.