CAR HANGING FROM INCOMPLETE FLYOVER: కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే గూగుల్ మ్యాప్స్ మనకు బెస్ట్ ఫ్రెండ్. కానీ ఆ ఫ్రెండే కొన్నిసార్లు ప్రమాదంలో పడియొచ్చు అనేలా తాజాగా ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటన నిరూపించింది. సరైన సమయంలో బ్రేక్ వేయడంతో తృటిలో పెను ప్రమాదం తప్పినప్పటికీ, ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
లఖ్‌నవూ నుంచి వస్తున్న ఓ వ్యక్తి మహారాజ్‌గంజ్ జిల్లాలో గూగుల్ మ్యాప్స్ చూపించిన దారిలో కారు నడుపుకుంటూ పోయాడు. ఫరెందాలోని గోరఖ్‌పూర్-సోనౌలి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఒక ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నాడు. ఫ్లైఓవర్ ఒక వైపు పూర్తి కావడంతో, ఇది మామూలు రోడ్డు అనుకుని ‘డ్రైవింగ్ గోస్ ఆన్’ అన్నట్టుగా దూసుకుపోయాడు. కానీ ఒక్కసారిగా ముందున్న పెద్ద గొయ్యిని చూసి, సడెన్‌గా బ్రేక్ కొట్టాడు. అంతే కారు ముందు భాగం గాల్లో వేలాడుతూ ఆగిపోయింది.
విచారణకు ఆదేశించి కారకులపై చర్యలు తీసుకుంటాం:
ఈ సంఘటన చూసిన నెటిజన్లు ‘గుడ్డిగా గూగుల్ బాబాను నమ్మాడే… ఆకాశంలో వేలాడేలా చేశాడే” అంటూ నవ్వుకుంటున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి, ఆ కారు డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. క్రేన్ సాయంతో పోలీసులు ఆ కారును అక్కడినుంచి తొలగించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్, భద్రతా సిబ్బందితో పాటుగా అధికారులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించి కారకులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.