రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)పై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను ఏ6గా చేరుస్తూ మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఇదే కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి మచిలీపట్నం స్పెషల్ మొబైల్ జడ్జి రిమాండ్ విధించారు. దీంతో నిందితులను సబ్‌జైలుకు తరలించారు.
నలుగురు నిందితుల్లో గోదాము మేనేజర్ మానస్ తేజ, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బోట్ల మంగరాజు ఉన్నారు. ఇక ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధను ఏ1గా పోలీసులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆమెకు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసులు విచారణకు మాత్రం సహకరించాలని ఆదేశించింది.