Sunday, September 8, 2024
HomeNewsChildren literature: బాలసాహిత్య గ్రంథాలకు పెద్దపీట

Children literature: బాలసాహిత్య గ్రంథాలకు పెద్దపీట

బాలసాహిత్య పరిశోథకులకు ఈ గ్రంథం దిక్సూచి

గత దశాబ్ద కాలంగా బాలసాహిత్యంలో అనేక మార్పులు సంతరించుకుంటున్నాయి. బాల సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ విలువైన పుస్తకాలు ముద్రించబడుతున్నాయి. ప్రచురణ సంస్దలు కూడా బాల సాహిత్యాన్ని ముద్రించటానికి ముందుంటున్నాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్‌ వారు ప్రతి సంవత్సరం గ్రంథ ముద్రణ కోసం రచయితలకు తనవంతు ఆర్ధిక సహకారం అందిస్తూనే ఉంది. రచయితలు సొంత ఖర్చులతో తమ సాహిత్యాన్ని తామే గ్రంథ రూపంలో తీసుకువస్తున్నారు. ప్రతి సంవత్సరంలాగానే 2023లో కూడా విలువైన బాలసాహిత్యం ముద్రించబడింది.
తెలంగాణ సారస్వత పరిషత్‌ బాల కథా సౌరభం, పేరిట గ్రంథం ప్రచురించింది. పుక్కిట పురాణ కథలు, పంచతంత్ర కథలు, తెలుగు జాతీయాలు కథలు, స్ఫూర్తి కథలు, చరిత్ర కధలు, పురాణం బాలల కథలు, సామెతల కథలు, వేమన కథలు, దశావతారాల కథలు, విజ్ఞాన అవిష్కరణల కథలు, ప్రముఖుల బాల్య కథలు, పాత కొత్త కథలు అనే 14 విభాగాలలో ఒక్కొక్క విభాగంలో ఒక్కో పేజీకి మించకుండా కథలున్నాయి. ఇందులో పైడిమర్రి రామకృష్ణ, డాక్టర్‌ సిరి, డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ రాసిన కథలున్నాయి.
రాజమండ్రికి చెందిన డైట్‌ గణిత ఉపాధ్యాయుడు కొమ్ముల వెంకట సూర్యనారాయణ. బాలల కోసం అనేక కథలు రాశారు. 2023లో బాలల కోసం నీతిని, మంచీ చెడుల తారతమ్యాన్ని తెలుపుతూ ‘బాల కథా చంద్రిక’ (కమ్మని నీతి కథల సంపుటి) ప్రచురించారు. సిద్దిపేటకు చెందిన ‘కథల తాతయ్య ’ ఎన్నవెళ్లి రాజమౌళి. బాలలు ఆడుతూ పాడుకునేలా ’మిస్త్స్రల్‌ మ్యాన్‌ ’ (బాల గేయాలు) ప్రచురించారు. సిరిసిల్లకు చెందిన ప్రముఖ రచయిత్రి డాక్టర్‌ కందేపి రాణిప్రసాద్‌. ఒక వైపు హాస్పిటల్‌ నిర్వహణ బాధ్యతలు, మరోవైపు బాలసాహిత్య సృజన చేపట్టారు. తన తండ్రి అంగలకుదిటి సుందరాచారి పేరిట పొ.శ్రీ.తె.వి. ద్వారా కీర్తి పురస్కారం అందిస్తున్నారు. బాలసాహిత్యంలో విరివిగా గ్రంధాలు ముద్రించారు. 2023లో ‘మృగయాపురి’ (బాల ల బొమ్మల తయారీ వ్యాసాలు), ‘రాణీప్రసాద్‌ కథలు’ (పిల్లల కథలు), ‘వర్ణ లిపి’ (భారతీయ కలల వ్యాసాలు), ‘ఏనుగును పెంచుకుందాం’ (పిల్లల అల్లరి కథనాలు) ప్రచురించారు. కడప జిల్లా పొద్దిటూరుకు చెందిన కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత డి.కె.చదువుల బాబు. వీరి ‘గజ్జెలగుర్రం’ (బాలల కధలు) సంపుటిని 2023లో దీప్తి బుక్‌ హౌస్‌ ప్రచురించింది.
ప.గో జిల్లా నిడదవోలుకు చెందిన రచయిత్రి డాక్టర్‌ చెరుకుపల్లి హారిక. హైదరాబాద్‌ లో దంత వైద్యురాలిగా సేవలందిస్తూ బాలసాహిత్యంలో విశేష కృషి చేస్తున్నారు. ‘ఆకాశంలో అల్లరి’ (పిల్లల కథలు) ప్రచురించారు. అటు అమెరికాలో, ఇటు ఇండియాలో బాలల వ్యక్తిత్వ వికాసానికి కథల ద్వారా ఎంతో కృషి చేస్తున్న రచయిత్రి డాక్టర్‌ అమర వాది నీరజ. 2023లో బాలలకోసం ‘ఏడు రంగుల జెండా’ (బాలల కథలు) ప్రచురించారు. ఈ కథల సంపుటిలో మొత్తం 22 కథలున్నాయి. కథలు వేటికవే భిన్నమైన కథాంశంతో ఉంటాయి.
మనకు చందమామ అనగానే గుర్తోచ్చే రచయిత మాచిరాజు కామేశ్వరరావు. కెనరా బ్యాంక్‌ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు. చందమామలో 150కు పైగా దయ్యాల కథలు రాశారు. వీరు రాశిన కొన్ని కథల్ని జె.పి.పబ్లికేషన్స్‌ నవంబరు 2023లో ‘దేశసేవ’ (బాలల కథల సంపుటి) గా ప్రచురించింది. బాలసాహిత్య పరిషత్‌ మాచిరాజు కామేశ్వరరావుకు ‘కధల చందమామ ’ బిరుదు ప్రదానం చేసింది.
పైడిమర్రి రామకృష్ణ బాలసాహిత్య పరిషత్‌ కోశాధి కారిగా సేవలందిస్తూ బాలలకోసం కథల పుస్తకాలు ప్రచురించారు.2023లో ‘నాదర్‌ గుల్‌ ప్రచురణలు’ ద్వారా మూడు గ్రంథాలు ప్రచురించారు. బాలసాహితీవేత్తలను పరిచయం చేస్తూ ‘బాలసాహితీ శిల్పులు’ ప్రచురించారు. ఇవి గతంలో సూర్య ఆదివా రంలో ‘బాలసాహితీ శిల్పులు’, ఆంధ్రప్రభ శనివారం పేజీలో ‘బాలసాహితీ బంధువులు’, అల పత్రికలో ’ బాల సాహితీ అలలు’ శీర్షికన ప్రచురించి బాలసాహితీవేత్తలకు పెద్ద పీట వేశాయి. బాలసాహిత్య పరిశోథకులకు ఈ గ్రంథం దిక్సూచిలా నిలుస్తుంది.
ఇంకా ‘తాంబేలు ఇగురం’ (బాలల కథలు) ప్రచురించారు. ఈ కథలన్నీ ఆకాశవాణి ఆదిలాబాద్‌ కేంద్రం ‘కతిందాం’ శీర్షికన బాలలకోసం ప్రసారం చేయటం విశేషం. మరో కథల సంపుటి జోర్దార్‌ కతలు ( తెలంగాణ భాషలో బాలల కథలు ) ఇటు రెండు తెలుగు రాష్ట్రాల బాలలను ఆకట్టుకుంది. ఎక్కువ మంది విమర్శకుల ప్రశంసలు అందు కున్న పుస్తకంగా చెప్పవచ్చు. అనేక సమీక్షలు ప్రచురించబడ్డాయి.
గరిపెల్లి అశోక్‌ ‘బడిబువ్వ’ (బాలల కథలు). ఇవి పెద్దక్క కథలు. 2023లో గరిపెల్లి అశోక్‌ రాసిన కొత్త పుస్తకం. ఇందులో పది కథలున్నాయి. ప్రతి కథలోనూ ప్రధాన పాత్ర పెద్దక్కనే. తెలంగాణ మాండలిక సుగంథాలు కథల అంతటా మనం ఆస్వాదిస్తాము. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ సౌత్‌ రీజనల్‌ మేనేజర్‌ డాక్టర్‌ పత్తిపాక మోహన్‌. బాలసాహిత్యంలో కేంద్రసాహిత్య పురస్కారం అందుకున్నారు. 2023లో ‘మాయల చిప్ప’ (తెలంగాణ భాషలో బాలల కతలు) ప్రచురించి పలువురి మన్ననలు పొందారు. 26 పేజీల ‘మాయల చిప్ప’ బాలల కధల సంపుటిలో మొత్తం 7 కధలున్నాయి.
నల్లగొండకు చెందిన కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ బాలసాహిత్యంలో విశేషకృషి చేస్తున్నారు. వీరి తాజా కథల సంపుటి ‘బంతిపూలు’ (బాల ల కథలు ) బాలల మన్ననలు పొందింది. తూ.గో జిల్లా మానేపల్లికి చెందిన వచయిత కె.వి.లక్ష్మణరావు. వీరు రాసిన కొన్ని కథల్ని 2033లో ‘టక్కరి మొసలి ’ (బాలల కథలు)గా నవ చేతన పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురించింది. ఇందులో మొత్తం 17 కథలు వేటికవే భిన్నంగా ఉంటాయి.
తూ.గో జిల్లా జంగారెడ్డి గూడెంకు చెందిన వచయిత కూచిమంచి నాగేంద్ర. ఇటీవల గృహనిర్మాణ సంస్ధలో పదవీవిరమణ పొందారు. వీరి తాజా బాలల కథల సంపుటి ‘చందమామలో మేనమామ’ (బాలల కథలు) నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ 2023లో ప్రచురించింది. సీనియర్‌ కథకురాలు యలమర్తి అనూరాధ పెద్దల కథలతో పాటు బాలసాహిత్యంలో కూడా కృషి చేస్తున్నారు. బాలల కోసం ‘పసిమొగ్గలు’ (బాలల కథలు) ప్రచురిం చారు. విజయనగరానికి చెందిన ఎన్‌.కె.బాబు ‘వెన్నెల పూలు’ (బాలల కథల సంకలనం) ప్రచురించారు. ఈ సంకలనంలో ఎన్‌. కె. బాబు, పైడిమర్రి రామకృష్ణ, కూర చిదంబరం, బెలగాం భీమేశ్వరరావు వంటి ప్రముఖుల కథలున్నాయి. విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు చెందిన రచయిత పట్రాయుడు కాశీవిశ్వనాథం. 2023లో ‘తాతయ్యకల’ (బాలల బొమ్మల కథలు) ప్రచురించారు. ఈ కథలు ఆకాశవాణి ఆదిలాబాద్‌ కేంద్రం నుండి ‘కతిం దాం’ శీర్శికన ప్రసారమయ్యాయి. ధర్మపురికి చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త సంగనభట్ల చిన్నరామకిష్టయ్య. వీరు రాసిన కొన్ని కథల్ని నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ 2023లో ‘బుజ్జి కుందేలు ధైర్యం’ (బాలల కథలు) సంపుటిగా ప్రచురించింది. పార్వతీపురానికి చెందిన మరో కేంద్రసాహిత్య పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు. నారంశెట్టి బాలసాహిత్య పీఠం వ్యవస్దాపక అధ్యక్షులుగా సేవలందిస్తూ తోటి రచయితలకు పురస్కారాలు అందిస్తున్నారు. 2023లో ‘తప్పెవరిది’ (బాలల కథల సంపుటి) ప్రచురించారు.
కర్నూలు జిల్లాకు చెందిన గద్వాల సోమన్న 2023 లో అక్షర పద గేయాలు, జయహో చంద్రయాన్‌ -3 వంటి 18 గేయ సంపుటాలు ముద్రించి ప్రత్యేకత చాటుకున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన వురిమళ్ల సునంద ‘చిరు స్వరాలు’ (ఉమ్మడి ఖమ్మం జిల్లా బాలల గేయాల సంకలనం), నాగుపల్లి కవితా మువ్వలు (బాలల కవితా సంక లనం), నాగుపల్లి కథా దివ్వెలు (బాలల కథల సంకలనం)
మనవడికో ఉత్తరం (లేఖా ప్రక్రియ) పంచదార చిలుకలు (బాలల గేయాలు) ప్రచురించారు. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు తాజా బాలల కథల సంపుటి ‘నాన్నారం’ కథలు ప్రచురించారు.
కాకినాడకు చెందిన ప్రముఖ రచయిత్రి పి.ఎల్‌.ఎన్‌. మంగారత్నం ‘ట్రబుల్‌ మేకర్‌ ’ బొమ్మలతో తెలుగు కథలు ప్రచురించారు. పెందోట వెంకటేశ్వర్లు ‘భలే భలే ఆటలు ’ (బాల గేయ సంపుటి), ‘మేలుకొలుపు’ (బాల కథా సం పుటి ), ‘మానవ చిగురులు’ (బాల గేయ సంకలనం), ‘గెలుపుల ప్రసాదం’ (బాల గేయ సంపుటి), ‘బాల సాహిత్య సృజన కారులు’ (బాల సాహితీవేత్తల పరిచయాలు) ప్రచురించారు.
సుధామూర్తి గారి ఆంగ్ల పుస్తకాలు ‘ది గోపి డైరీస్‌’ను ‘గోపి కబుర్లు’ పేరిట, ‘ది మ్యాజిక్‌ ఆఫ్‌ ది లాస్ట్‌ స్టోరీ’ని ‘మరుగున పడిన అద్బుత కథ’ పేరిట ముంజులూరి కృష్ణ కుమారి తెలుగులోకి అనువాదం చేశారు. పాల్వంచకు చెందిన మా.శ్రీ.రాజు ఎన్నో బాలల కథలు రాశారు. ‘అమ్మ’ బాలల కథల సంపుటి ప్రచురించారు. తపస్వీమనోహరం ప్రచురణ సంస్ద ప్రచురించిన ఈ కథల సంపుటిలో మొత్తం 32 కథలున్నాయి. ఆధునిక భావాలతో ఈకథలన్నీ మలచబడ్డాయి. ఈ కథల సంపుటి మాకరాజు శ్రీనివాసరాజు మొదటి కథల సంపుటి కావటం విశేషం. భారతదేశ రక్షణ సంస్థలో పనిచేసి, బాలసాహిత్యంలో కృషిచేస్తున్న రచయిత కందర్ప మూర్తి. వీరు రాసిన కొన్ని కథలను ‘తపస్వీ మనో హరం’ ప్రచురణ సంస్ద ‘గజరాజే వనరాజు’ సంపుటిగా ప్రచురించటం హర్షణీయం. ఈ సంపుటిలో మొత్తం 40 కథలున్నాయి. ఇవన్నీ జంతువులు, పక్షులతోపాటు కీటకాలు, వృక్షాలు కూడా ప్రధాన పాత్రలుగా ఉన్న కథలు. ఇవేకాక యువ కథకులు ముక్కామల జానకీరాం ఆఫ్‌ లైన్‌ (బాలల కథలు) కథల సంపుటి, వడ్డేపల్లి వెంకటేశ్‌ ’ పిల్లల జాబిల్లి’ (బాలల కథలు) 2023 డిసెంబరు చివరి వారంలో వెలుగు చూడనున్నాయి. ఇంతేకాదు బాలల కోసం బాలలే రాసుకున్న కథల సంకలనాలు అనేకం వెలువడ్డాయి. వాటి గురించి మరో వ్యాసంలో రాస్తాను. కొత్త ప్రభుత్వాలు బాలసాహితీవేత్తలను ప్రోత్సహిస్తూ బాలసాహిత్య పుస్తక ముద్రణ, పంపిణీ చేపట్టాలి. విరివిగా బాలల గ్రంథాలయాలను ఏర్పాటు చేసి ఉచితంగా పుస్తకాలు అంద చేయాలి. పుస్తక పఠనం బాలల్లో వికాసాన్ని, విజ్ఞానాన్ని కలిగిస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు. 2024లో మరిన్ని విలువైన గ్రంథాలు వెలుగు చూడాలని కోరుకుందాం.

- Advertisement -

-పైడిమర్రి రామకృష్ణ
92475 64699.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News