CRPF Inspector Kiran harasses woman: రక్షకులే భక్షకులైతే.. కాపాడాల్సిన చేతులే వేధింపులకు పాల్పడితే… ఇంకెవరికి చెప్పుకోవాలి. కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ సీఆర్పీఎఫ్ సీఐ వీరంగం సృష్టించాడు. ఖాఖీ బట్టలకే మాయని మచ్చ తెచ్చాడు. మద్యం మత్తులో కన్నుమిన్ను కానకుండ నడిరోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకున్న వారిపై దాడికి తెగపడ్డాడు.
మద్యం మత్తులో అరాచకం:
సీఆర్పీఎఫ్ సీఐగా పనిచేస్తున్న కిరణ్ తన స్నేహితులతో కలిసి గన్నవరంలో రోడ్డు పక్కన కారు ఆపి మద్యం సేవించాడు. అదే సమయంలో అటునుంచి ఒంటరిగా ఇంటికి వెళ్తున్న ఓ మహిళను చూసిన సీఐ వికృత చేష్టలకు పాల్పడ్డారు. కారు లైట్లు వేస్తూ, హారన్ కొడుతూ ఆమెను భయభ్రాంతులకు గురిచేశారు.
భర్తపై దాడి: భయపడిపోయిన ఆ మహిళ వెంటనే తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న భర్త.. సీఐ కిరణ్ బృందాన్ని ప్రశ్నించడంతో వారు మరింత రెచ్చిపోయారు. మేమింతే చేస్తాం.. ఏం చేసుకుంటావో చేసుకోమంటూ బూతుపూరాణం మెుదలెట్టాడు. సీఐ తన స్నేహితులతో కలిసి మహిళ భర్తపై విచక్షణారహితంగా దాడి చేశారు.
పోలీస్ స్టేషన్‌లోనూ దర్జా:
బాధిత దంపతులు తమ బంధువులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను నిలదీశారు. బాధితురాలు గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. అక్కడ కూడా కిరణ్ తన అధికార దర్పాన్ని ప్రదర్శించాడు. స్టేషన్‌లోని పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు భద్రాచలంలో సీఆర్పీఎఫ్ సీఐగా పనిచేస్తున్నట్లు ధ్రువీకరించారు. అధికార అండతో ఒక మహిళ పట్ల ఇంతటి దారుణంగా ప్రవర్తించిన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత దంపతులు కోరారు.


