Tuesday, November 26, 2024
HomeNewsDigitalisation manuscripts: పురాతన గ్రంథాల నిక్షిప్తానికి బృహత్ ప్రయత్నం

Digitalisation manuscripts: పురాతన గ్రంథాల నిక్షిప్తానికి బృహత్ ప్రయత్నం

ఈ గ్రంథాలు ప్రపంచంలో మరెక్కడా లభ్యం కాని అతి అరుదైనవి

తిరుపతిలోని కేంద్రీయ సం‍స్కృత విశ్వవిద్యాలయం ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టింది. అతి ప్రాచీన సంస్కృత గ్రంథాలను, తాళపత్ర గ్రంథాలను డిజిటలీకరణ చేసి, భద్రపరచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సుమారు 4,000 అత్యంత ప్రాచీన గ్రంథాలను ఈ విద్యా పీఠం డిజిటలీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని అహర్నిశలూ పనిచేస్తోంది. ఇందుకోసం డిస్పేస్ అనే వెబ్ పోర్టల్ ను రూపొందించింది. విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్, ఇతర విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధికారులకు మాత్రమే ఈ వెబ్ పోర్టల్ ను తెరిచే అవకాశం ఉంటుంది. పరిశోధకులు, పండితులు, విద్యార్థులు, సంస్కృతంలో అధ్యయనం చేసే సంస్థలకు ప్రత్యేక అనుమతితో దీనిని తెరవడానికి అవకాశం ఉంటుంది.

- Advertisement -

ఈ విశ్వవిద్యాలయం వద్ద ఏడు వేలకు పైగా ప్రాచీన సంస్కృత గ్రంథాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ గ్రంథాలన్నీఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచి విరాళంగా వచ్చినవే. వీటన్నిటినీ విద్యా పీఠంలోని ఒక ప్రత్యేక విభాగంలో భద్రపరచడం జరిగింది. ఈ ఏడు వేల గ్రంథాలలో 14 ప్రధాన శాస్త్రాలకు సంబంధించిన సమాచారం ఉంది. వీటిని వివిధ కాలాలకు సంబంధించి సంస్కృతంతో పాటు 12 ప్రాచీన భాషలలో రాయడం జరిగింది. ఇందులో నాలుగు వేల గ్రంథాలను ఇప్పటికే డిజిలిటీకరణ చేయడం పూర్తయింది.

ఈ కేంద్రీయ సం‍స్కృత విశ్వవిద్యాలయంలోనే తాళపత్ర గ్రంథాల నిక్షిప్తానికి ఒక ప్రత్యేక విభాగం ఉంది. ఇది 1964 నుంచి పనిచేస్తోంది. అప్పట్లో ఈ విశ్వవిద్యాలయాన్ని కేంద్రీయ సంస్కృత విద్యాపీఠ్ అని పేరుండేది. పురాతన, అధునాతన నిక్షిప్త పద్ధతులను మేళవించి వీటిని నిక్షిప్తం చేయడం జరుగుతోంది. వీటిని భద్రపరిచేవారు, సంరక్షకులకు కూడా ఆధునిక పద్ధతుల్లో శిక్షణనివ్వడం జరుగుతోంది. తాళపత్ర గ్రంథాలను డిస్పేస్ పోర్టల్ లో డిజిటలీకరణ చేయడం ఇటీవలే ప్రారంభం అయింది. గత ఆరు నెలల కాలంలో వంద తాళపత్ర గ్రంథాలను డిజటలీకరణ చేయడం పూర్తయింది. వచ్చే 12 నెలల కాలంలో మరో మూడు వేల పురాతన తాళపత్ర గ్రంథాలను కూడా డిజిటలీకరణ చేయాలని ఈ విశ్వవిద్యాలయం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పురాతన గ్రంథాలలో కూడా అనేక కట్టలుంటాయని, సాధారణంగా ఒక్కో గ్రంథంలో రెండు మూడు కట్టలు ఉండడం కూడా జరుగుతుందని అధికారుల తెలిపారు.

ఫలానా గ్రంథం లేదా ఫలానా అంశం మీద తమకు సమాచారం కావాలని ఎవరైనా కోరితే వారికి అధికారుల అనుమతితో ఈ పోర్టల్ ను ఓపెన్ చేసే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. వారు మాత్రమే వెబ్ పోర్టల్ లోని రాత ప్రతులను చూసే అవకాశం ఉంటుంది. ఈ గ్రంథాలు ప్రపంచంలో మరెక్కడా లభ్యం కాని అతి అరుదైనవనీ, వీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత తమ మీద ఉందని విశ్వవిద్యాలయం భావిస్తోంది. విశ్వవిద్యాలయం వద్ద ఇప్పుడున్న ఏడు వేల గ్రంథాలకు తోడు మరికొన్ని గ్రంథాలను కూడా సేకరించడానికి విశ్వవిద్యాలయం ప్రస్తుతం కృషి చేస్తోంది. ఈ పురాతన గ్రంథాల సంఖ్యను ఈ ఏడాది ఏడు వేల నుంచి పదివేలకు పెంచాలని భావిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News