Trump Says US Wont Kill Khameni : ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఎక్కడ ఉన్నారో తమకు తెలుసని ట్రంప్ స్పష్టం చేశారు.
అయితే, ఖమేనీని లక్ష్యంగా చేసుకోవడం తమకు పెద్ద విషయమేమీ కాదని, కానీ ప్రస్తుతానికి ఆయనను చంపే ఉద్దేశం తమకు లేదని ట్రంప్ తెలిపారు. తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ బేషరతుగా లొంగిపోవాలని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచే అవకాశం ఉంది. ట్రంప్ వ్యాఖ్యలు ఇరాన్‌ను రెచ్చగొట్టేవిగా ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంతా మా నియంత్రణలోనే: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ గగనతలంలో అమెరికాకు పూర్తి నియంత్రణ లభించిందని, ఇరాన్ వద్ద ఉన్న ఆకాశ ట్రాకర్లు (sky trackers) గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ, అమెరికా సామర్థ్యంతో పోలిస్తే ఏమాత్రం సరిపోలవని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అమెరికా తయారుచేసిన, రూపొందించిన ఉత్పత్తి చేసిన వస్తువులతో ఎవరూ పోటీపడలేరని, ట్రంప్ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.
అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, ఖమేనీ బంకర్లో
ఇజ్రాయెల్, ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా తీవ్రస్థాయిలో దాడులు చేస్తోంది. ఈ భీకర దాడుల కారణంగా, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తన కుటుంబంతో ఈశాన్య టెహ్రాన్‌లోని ఒక బంకర్‌లో తలదాచుకున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తోంది.
యుద్ధాన్ని ముగించడమే లక్ష్యం: నెతన్యాహు
ఇరాన్‌పై దాడులను సమర్థించుకున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, యుద్ధాన్ని ముగించడమే తమ లక్ష్యమన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమారిస్తేనే దీనికి ముగింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే, గతంలో ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్ చేసిన పథకాన్ని డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు వార్తలు రావడం గమనార్హం.