పీరియడ్స్ ముందర ఆ ఆలోచన వద్దు..
బరువు తగ్గాలనుకుంటున్నారా? మంచిదే. కానీ నెలసరి వచ్చే వారం రోజుల ముందు మాత్రం ఈ ఆలోచన
చేయొద్దదంటున్నారు పోషకాహార నిపుణులు. బరువు తగ్గడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. బరువు తగ్గాలంటే వ్యాయామాలు, డైటింగ్, జుంబా, యోగా వంటివి ఎంతో పద్ధతిగా చేయాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ పోషకాహార నిపుణురాలు రాశి చౌధురి నెలసరికి వారం రోజుల ముందు నుంచి బరువు తగ్గే ప్రయత్నాలు, ఆలోచనలు చేయకుండా ఉండడం మంచిదంటున్నారు.
నెలసరి సమయంలో స్త్రీలకు విశ్రాంతి చాలా అవసరమన్నారు. అంతేకాదు సహజంగా పీరియడ్స్ కు ముందర స్త్రీలు లావు అవుతారని ఆమె అంటున్నారు. కనుక ఎప్పుడైనా పీరియడ్స్ ముందు బరువు తగ్గే ఆలోచన చేస్తే అంతకన్నా ఇబ్బందైన పని మరొకటి లేదని ఆమె తేల్చారు. పీరియడ్స్ ముందర బరువు తగ్గే ప్రయత్నం చేయకూడదనడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయంటున్నారామె. ఆ సమయంలో ప్రొజెస్టరోన్, ఈస్ట్రోజన్ ప్రమాణాలు ఎక్కువై జీవక్రియ శక్తివంతంగా జరగదు.
మెటబాలిజం, ఆకలి తీరుతెన్నుల్లో మార్పులు వస్తాయి. దాంతో ఆ టైములో అతిగా కూడా తింటాం. ఫలితంగా సాధారణ రోజుల్లో కన్నా ఎక్కువ కాలరీలు శరీరంలోకి వెళ్లి ఆడవాళ్లు బరువు పెరుగుతారని, వెయిట్ లాస్ ఉండదని ఆమె అంటున్నారు. అందుకే పీరియడ్స్ ముందర సమతులాహారం తీసుకుంటూ
మోడరేట్ వ్యాయామాలు చేయడం మంచిదని ఆమె సూచిస్తున్నారు.