సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వచ్ సర్వేక్షన్ లో దక్షణ భారత దేశంలోనే సిద్దిపేట కు క్లీన్ సిటీ అవార్డ్ వచ్చిన నేపథ్యం లో మున్సిపల్ కార్మికులను సన్మానించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ..
క్లినెస్ట్ సిటీ ఆఫ్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియాగా సిద్దిపేట అవార్డు (చెత్త సేకరణలో సమర్థవంతంగా నిర్వహణ) సాధించడం మనందరికీ గర్వకారణమన్నారు హరీష్. ఇందుకు కృషి చేసిన మున్సిపాలిటీ, కౌన్సిలర్లు, అధికారులు, అభినందనలు తెలుపతూ, ఈ అవార్డు సిద్దిపేట ప్రజలకు అంకితమన్నారు. ప్రజల భాగస్వామ్యం లేనిది, అనుకున్న లక్ష్యం నెరవేరడం సాధ్యం కాదని, సిద్దిపేట వారి సొంత ఇంటిగా భావించి, శుద్దిపేటగా నిలబెట్టారన్నారు.
అది చూశాక కడుపు నిండిన ఆనందమయింది..
చెత్త వేయడం, సఫాయి వారు వచ్చి తీయటం కాదు. అసలు చెత్తను అక్కడి ప్రజలు రోడ్ల మీద వేయరు. చాక్లెట్ కవర్ అయినా జేబులో పెట్టుకొని వెళ్లి డస్ట్ బిన్ లో వేస్తారు. మన సిద్దిపేట ప్రజలు కూడా అలా ఉన్నతంగా ఆలోచించే స్థాయికి వెళ్ళారు. ఒకనాడు ఒక ఆటో డ్రైవర్ తమ్ముడు మాట్లాడే వీడియో చూసా. కొత్తగా సిద్దిపేటకు వచ్చిన ఓ ప్యాసింజర్ కు చెబుతున్నడు. చాక్లెట్ కవర్ అయినా, చిత్తు కాగితం అయినా డస్ట్ బిన్ లోనే వేస్తాం అని. నాకు కడుపు నిండిన సంతోషం కలిగింది. ప్రజల్లో ఇంత పెద్ద మార్పు రావడం వెనుక అధికారులు, ప్రజా ప్రతినిధుల కృషి ఉంది. మీకు అభినందనలు.
-భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ మున్సిపాలిటీలకు, అత్యుత్తమ పట్టణాలకు అవార్డులు ప్రకటిస్తున్నారంటే అందులో సిద్దిపేట పేరు ఉండాల్సిందేనన్న ఆయన గతంలోనూ మనకు ఇలా అనేక అవార్డులు దక్కాయన్నారు. అవార్డు అంటే సిద్దిపేట, సిద్దిపేట అంటే అవార్డు అనే స్థాయిలో సిద్దిపేట చేరింది అంటే అది మీ అందరి కృషి అంటూ హరీష్ అనటం విశేషం. నడుద్దాం, నడుస్తూ చెత్తను వేరు చేద్దాం అంటూ కలిసికట్టుగా కౌన్సిలర్స్ తెచ్చిన చైతన్యం ఈ అవార్డుకు నిదర్శనమన్నారు.
22 జాతీయ అవార్డులు సాధించిన ఘనత సిద్దిపేట కు దక్కిందని, ఇది ఇలాగే కొనసాగాలన్నారు. దేశంలోనే పరిశుభ్రమైన పట్టణం ఏది అంటే తెలంగాణలో ఉన్న సిద్దిపేట అని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరాలన్నారు. రాష్ట్రం ఒకే ఒక్క మున్సిపాల్టీకి జాతీయ స్థాయి అవార్డు ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి అభినందనలు తెలపని పరిస్థితి అంటూ ఆయన మండిపడ్డారు. 2023 లో దేశంలో 4,416 మున్సిపాల్టీలో 9 వ స్థానంలో హైదరాబాద్ నిలిస్తే, మన దక్షిణ భారత దేశం లో సిద్దిపేట ఫస్ట్ నిలిచిందని ఆయన గుర్తుచేశారు.
కానీ రాష్ట్ర ప్రభుత్వం తరుపున అభినందన ట్వీట్, ప్రెస్ నోట్ కూడా నోచుకోలేని దుస్థితి లో ఉన్నామన్నారు. అవార్డు వస్తే ఇంత కుళ్లా అంటూ హరీష్ తన ప్రసంగంలో ప్రత్యేకంగా నొక్కి చెప్పారు.