కర్ణాటకలో అనుకున్నదొకటి అయింది ఒకటి అన్నట్టుగా ఇటీవల ఒక పరిణామం చోటు చేసుకుంది. ఊహించినట్టుగానే ఇది మత సంబంధమైన వ్యవహారమేనని చెప్పవచ్చు. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న సుమారు లక్షమంది అర్చకుల సంక్షేమం కోసం ఉద్దేశించినట్టు చెబుతున్న కర్ణాటక హిందూ మత సంస్థలు, దేవాదాయ, ధర్మాదాయ చట్టం (1997) సవరణ బిల్లుకు బీజేపీ ఇటీవల అడ్డుకట్ట వేసింది. రాష్ట్రంలోని వేలాది మంది నిరుపేద అర్చకుల సంక్షేమం కోసం రూపొందించిన ఈ బిల్లును బీజేపీ అడ్డుకుని, ఆలయాలు, అర్చకుల విషయంలో తాను అనుసరించే ద్వంద్వ ప్రమాణాలను మరోసారి చాటుకుందంటూ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఆరోపించింది. శాసనసభలో ఆమోదం పొందిన ఈ సవరణ బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందకపోవడంతో ఇది అమలులోకి రాలేదు. ఈ బిల్లు విషయంలో బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టింది. శాసనమండలిలో బీజేపీ, జనతాదళ్ (ఎస్)లకు సంఖ్యా పరంగా ఆధిక్యం ఉండడంతో ఈ బిల్లుకు గండిపడింది.
రాష్ట్రంలో కోటీ రూపాయలకు పైగా ఆదాయం కలిగిన 87 దేవాలయాలు, పది లక్షల రూపాయలకు పైగా ఆదాయం కలిగిన 31 దేవాలయాలు 10 శాతం, 5 శాతం వంతున పన్ను చెల్లించాలని ఈ బిల్లు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించడం జరుగుతుంది. ఈ పన్ను మొత్తాన్ని ఉమ్మడి సహాయ నిధికి తరలించి, వీటిని ఇతర మతస్థుల మత పెద్దలకు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. ఈ ఉమ్మడి సహాయ నిధి 1997 నుంచి అమలులో ఉంది. ఇదివరకు పది లక్షల రూపాయల ఆదాయం ఉన్న ఆలయాల నుంచి నిధులు వసూలు చేసి ఈ సహాయ నిధికి కలపడం జరుగుతోంది. ఇప్పుడు దీన్ని కోటి రూపాయలకు పెంచుతు న్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో బీజేపీ ప్రభుత్వమే ఈ సహాయ నిధిని ఏర్పాటు చేయడంతో పాటు, పది లక్షల రూపాయల ఆదాయ పరిమితిని నిర్ణయించింది. అయితే, ఈ నిధులను కేవలం హిందూ దేవాలయాల అర్చకుల కోసం, హిందూ ఆలయాల పునరుద్ధరణ, మరమ్మతులు, సౌకర్యాల కోసమే ఖర్చు పెట్టడం జరిగేది.
ఇప్పుడు ఆలయాల ఆదాయ పరిమితిని కోటి రూపాయలకు పెంచి ఈ సహాయ నిధికి అందజేయడం అనేది కేవలం ఇతర మతాల ప్రార్థనా మందిరాలు, మత పెద్దల సంక్షేమం కోసమే జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో అనేక దేవాలయాల ఆర్థిక పరిస్థితి సుసంపన్నం గానే ఉంది కానీ సుమారు 33,000 ఆలయాల పరిస్థితి దుర్భరంగా ఉంది. ఈ ఆలయాల్లోని అర్చకులు నిరుపేద జీవితం గడుపుతున్నారు. అంతేకాక, ఈ ఆలయాల్లో దీపం వెలిగించేందుకు కూడా నిర్వాహకులకు స్తోమత లేదు. వీటిల్లో అనేక ఆలయాల ఆర్థిక పరిస్థితి సాలీనా అయిదు లక్షల రూపాయలు కూడా ఉండడం లేదు. కాగా, పన్ను విధిం చడం ద్వారా సంపన్న ఆలయాల నుంచి వసూలు చేసిన ఆదాయాన్ని సహాయ నిధిలో జమ చేసి, పేద ఆలయాల పునరుద్ధరణకు ఉపయోగించడం జరుగుతుందంటూ కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న వాదనతో ప్రతిపక్షాలు ఏకీభవించడం లేదు.
ఇప్పటికే అనేక విధాలుగా హిందూ ఆలయాల సొమ్మును ఇతర మతసంస్థలకు, ప్రార్థన మందిరాలకు ఉపయోగించడం జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. హిందూ మతం పట్ల, హిందూ ఆలయాల పట్ల కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉంటోందని కూడా బీజేపీ ఆరోపించింది. హిందూ దేవాలయాల అర్చకులకు ఇళ్ల నిర్మాణం, పిల్లలకు చదువులు, ఆరోగ్య సంరక్షణ, బీమా, ఆలయాలకు మరమ్మతులు వంటి వాటి కోసం ఈ సహాయ నిధి నుంచి 25 కోట్ల రూపాయలు ఖర్చు చేయదలచినట్టు కర్ణాటక ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది. ఆలయాల నిర్వహణ కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా అది వెల్లడించింది. ఇప్పటికే ఈ సహాయ నిధి నుంచి ఇతర మతాలకు నిధులు తరలిస్తున్న కర్ణాటక ప్రభుత్వం మరింత పెద్ద ఎత్తున నిధులను మళ్లించడానికి ఈ సవరణ బిల్లును తీసుకు వస్తోందంటూ కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు.
తాము హిందూ దేవాలయాలకు సంబంధించిన నిధులను ఇతర మతాలకు మళ్లించే ప్రసక్తే లేదని, కేవలం హిందూ ఆలయాల పునరుద్ధరణకు, అర్చకుల సంక్షేమానికి మాత్రమే ఈ నిధులను ఉపయోగించడం జరుగుతుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య శాసనసభలో పేర్కొన్నారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలేవీ లేవని, ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తోందని ఆయన విమర్శించారు. హిందూ మత పునరుద్ధరణ పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తూనే హిందూ ఆలయాలు, అర్చకుల ప్రయోజనాలకు విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, రాష్ట్రంలోని వేలాది హిందూ ఆలయాలు మాత్రం పునరుద్ధరణకు, ఆర్థిక సహాయానికి ఎదురు చూస్తున్నాయి.
Another controversy in Karnataka: ఆ గుళ్లన్నీ ట్యాక్స్ కట్టాల్సిందే!
10,00000 పైగా ఆదాయం ఉండే టెంపుల్స్ ట్యాక్స్ కట్టాలి