Visa-Free Entry to 59 Countries: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో భారత్ ర్యాంకు మెరుగుపడింది. హెన్లీ పాస్‌పోర్ట్ సూచీ 2025 ప్రకారం గతేడాది 85వ స్థానంలో ఉన్న భారత్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 77వ ర్యాంకుకు చేరుకుంది. ఈ జాబితాను వీసా లేకుండా ఎన్ని దేశాలకు ప్రయాణించవచ్చు అనే అంశం ఆధారంగా రూపొందిస్తారు. దీంతో ప్రస్తుతం భారత పాస్‌పోర్టుతో 59 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. గతేడాది ఆ సంఖ్య 62 దేశాలుగా ఉండేది.
ప్రస్తుతం, భారతీయ పాస్‌పోర్ట్ కలిగిన వారు వీసా లేకుండా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, మాల్దీవులు వంటి దేశాలకు ప్రయాణించవచ్చు. శ్రీలంక, మయన్మార్ వంటి దేశాలు ఆ దేశంలో దిగిన తర్వాత (వీసా ఆన్ అరైవల్) వీసాలు మంజూరు చేస్తున్నాయి.
అగ్రస్థానంలో సింగపూర్..
శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో ఉంది. ఆ దేశ పాస్‌పోర్టుతో వీసా లేకుండా 193 దేశాలు చుట్టి రావచ్చు. జపాన్, కొరియా రెండో స్థానంలో ఉన్నాయి. ఆ దేశాల పాస్‌పోర్టుతో 190 దేశాలు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. మూడో స్థానంలో ఐరోపాలోని డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్ ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 189 దేశాలు వీసా లేకుండా తిరిగిరావచ్చు.


