Mega 157: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన రీ ఎంట్రీ తర్వాత ఏ సినిమాకి పెద్ద గ్యాప్ తీసుకోవడం లేదు. ఇప్పటికే 150 సినిమాలు పూర్తి చేసిన చిరు ఆయన చేయని పాత్ర లేదనే చెప్పాలి. హిట్ ఫ్లాప్ మెగాస్టార్ కి కొత్తకాదు. గాడ్ ఫాదర్, భోళా శంకర్ ఫ్లాపైనా వాల్తేరు వీరయ్య సినిమా మాత్రం 100 రోజులు ఆడింది. వింటేజ్ మెగాస్టార్ ని చూడాలని అభిమానులు ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు.
గతంలో ఆయన నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సంచలన విజయాన్ని అందుకుంది. ఇటీవల ఆ సినిమా రీ రిలీజ్ అయి కూడా మంచి వసూళ్ళను రాబట్టింది. అయితే, మళ్ళీ చాలాకాలానికి మెగాస్టార్ సోషియో ఫాంటసీ సినిమాను చేస్తున్నారు. ఆ సినిమానే విశ్వంభర. త్రిష హీరోయిన్గా నటిస్తుండగా ఆషిక రంగనాథ్ కీలకపాత్రలో కనువిందు చేయనుంది. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన యువ దర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది.
దీంతో మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ వరకూ వేచి చూడకుండా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మెగా 157 చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకువచ్చారు. ఓపెనింగ్ రోజే ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం అంటూ అనిల్ రావిపూడి స్టైల్లో చేస్తున్న వీడియోలు మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే, మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇటీవల ముస్సోరీలో సెకండ్ షెడ్యూల్ ని ప్రారంభించినట్టుగా టీమ్ ప్రకటించింది. ఈ మేరకు చిరు సహా కొందరు స్కూల్ స్టూడెంట్స్ తో కూడుకున్న పోస్టర్‌ను వదిలారు.
ఈ దూకుడు చూసి విశ్వంభర కంటే ముందే మెగా 157 వచ్చేస్తుందని ఫ్యాన్సే చెప్పుకుంటున్నారు. దీనికి కారణం అసలు విశ్వంభర సినిమా విషయంలో ఏం జరుగుతుందో ఎలాంటి అప్డేట్స్ రాకపోవడమే. మేకర్స్ ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ ఓ గ్లింప్స్, ఓ సాంగ్ తప్ప మిగిలిన విషయాలేవీ వెల్లడించడం లేదు. దీంతో సోషల్ మీడియాలో వీఎఫెక్స్ వల్ల ఆలస్యం అవుతుందని, మళ్ళీ రీ షూట్ చేస్తున్నారనీ వార్తలు వస్తున్నాయి. విశ్వంభర మేకర్స్ నుంచి ఈ వార్తలను ఖండిస్తూ ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. మరో వైపు చిరంజీవి, అనీల్ రావిపూడి మూవీ శరవేగంగా పూర్తవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి మెగా 157 రావాల్సి ఉంది. మరి విశ్వంభర మూవీ సంగతేంటో ఇంత వరకు తెలియటం లేదు. చూడాలి మరి విశ్వంభర నుంచి అప్డేట్స్ ఎప్పుడు రానున్నాయో.