జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జడ్చర్ల లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆదివారం బాదేపల్లి పాత బజార్ పెద్దగుట్ట కొండ చరియలు విరిగి పడుతున్నాయి.
కొండ చరియలు విరిగిపడి పడుతున్న నేపథ్యంలో పట్టణ వాసులు, భక్తులు ఎవరు గుట్టపైకి వెళ్ళవద్దని, అలాగే పాత బజార్, పాత పాత బస్టాండ్ ఏరియా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని పద్మావతి కాలనీ, తోపాటు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జడ్చర్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపాలిటి, పోలీస్ సిబ్బంది హెచ్చరించారు. మున్సిపాలిటీ పరిధిలోని సిగ్నల్ గడ్డ నుండి నేతాజీ చౌరస్తా వరకు వెళ్లే రోడ్డులో ఎగువ నుంచి వస్తున్న నేటి ఉదృతంగా ప్రవహిస్తోంది.
అలాగే జడ్చర్ల మండలం పరిధిలోని లింగంపేట్, కోడుగల్, నెక్కొండ, మున్ననూర్ గుండా ప్రవహించే వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. మండల పరిధిలోని ఆలూరు పంచాయతీ పరిధిలోని యాసాయకుంట చెరువు కట్ట తెగిపోయింది. గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా చెరువిలోకి భారీగా వరద నీరు చేరుకొని చెరువు నిండిపోయి కట్ట తెగింది. పంట నీట మునిగింది.
మున్సిపాలిటీ పరిధిలోని పాత బజార్ ఊరకుంట చెరువు పూర్తిగా నిండడంతో దిగువన ఉన్న పద్మావతి కాలనీ ప్రజలందరూ ఇళ్లను కాలి చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మున్సిపల్ కమిషనర్ రాజయ్య తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.