పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న అంతర్గత సీసీ రోడ్లు, అప్రోచ్ రోడ్లను 82 శాతం పూర్తిచేసి రాష్ట్రంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి హౌసింగ్, రెవెన్యూ సదస్సులు, పిజిఆర్ఎస్, పంచాయతీ రాజ్ సీసీ రోడ్లు, ఉపాధి హామీ, ఎమ్ఎస్ఎమ్ఈ సర్వే తదితర అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ రాజ్ ఇంటర్నల్ సీసీ రోడ్ల పనులకు సంబంధించి జిల్లాలో 813 సీసీ రోడ్ల పనులు, 17 అప్రోచ్ రోడ్లు పనులకు గాను ఇప్పటివరకు 682 పనులు పూర్తి చేసి 82 శాతం పురోగతి సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నామని కలెక్టర్ పేర్కొన్నారు. మిగిలిన రోడ్ల నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కృష్ణగిరి, పెద్దకడబూరు, మద్దికెర, చిప్పగిరి, కౌతాళం, మంత్రాలయం మండలాలు 75 శాతం కంటే తక్కువ ప్రోగ్రెస్ సాధించాయని, రోడ్ల నిర్మాణపు పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ సంబంధిత మండలాల ఎంపిడిఓలను ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ తహశీల్దార్లను ఆదేశించారు. ఇప్పటి వరకు 513 అర్జీలను పరిష్కరించారని, పరిష్కారాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దేవనకొండ మండలంలో ఒక అర్జీ కూడా పరిష్కారం కాకపోవడంతో కలెక్టర్ తహశీల్దార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదస్సులు మొదలయి 21 రోజులైనా ఒక్క అర్జీ కూడా పరిష్కారం కాకపోవడం ఏంటని కలెక్టర్ తహశీల్దార్ ను ప్రశ్నించారు. చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కారం చేయకుండా ఏం చేస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. రెవెన్యూ శాఖా మంత్రి, సి సి ఎల్ ఎ లు ఈ అంశంపై ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తుంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. తహశీల్దార్ పై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జాయింట్ కలెక్టర్, పత్తికొండ ఆర్డీవో లను ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల పరిష్కారం పై రోజు తనకు నివేదిక అందజేయాలని కలెక్టర్ డిఆర్ఓ ను ఆదేశించారు. 4,5 మండలాల్లో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయకుండా కేవలం ఎండార్స్మెంట్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి రాగా కచ్చితంగా అర్జీని కూడా అప్లోడ్ చేయాలని కలెక్టర్ తహశీల్దార్ లను ఆదేశించారు. హౌసింగ్ కి సంబంధించి జనవరి 3వ తేదిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తైన లక్ష ఇళ్లను ప్రారంభించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగనుందని, ఆ మేరకు జిల్లాలో పూర్తయిన ఇళ్లను ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియామకం చేస్తూ ఉత్తర్వులను సిద్ధం చేయాలని కలెక్టర్ హౌసింగ్ పీడీని ఆదేశించారు.
ఈ వారం జీరో ప్రోగ్రెస్
ఇళ్ళ నిర్మాణంలో కొంత కదలిక వచ్చిందని, అయితే పూర్తి స్థాయిలో ప్రోగ్రెస్ లేదని కలెక్టర్ పేర్కొన్నారు. ఆదోనిలో గత వారంలో 316 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి మంచి ప్రోగ్రెస్ చూపించారన్నారు. పత్తికొండ డివిజన్ లో 32 ఇళ్ళు, కర్నూలు డివిజన్ లో 24 ఇళ్ళు మాత్రమే పూర్తి అయ్యాయని, వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కర్నూలు, పత్తికొండ ఆర్డీఓ లను ఆదేశించారు. గత వారంలో మంత్రాలయం లో ఒక్క ఇల్లు, నిర్మించారని, ఈ వారం జీరో ప్రోగ్రెస్ ఉందని కలెక్టర్ మంత్రాలయం హౌసింగ్ ఏఈ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద కడుబూరులో కూడా ప్రోగ్రెస్ లేదని, మంత్రాలయం ఎంపిడిఓ, హౌసింగ్ ఏఈ లతో పాటు మంత్రాలయం స్పెషల్ ఆఫీసర్, పెద్దకడుబూరు స్పెషల్ ఆఫీసర్ లు కూడా హౌసింగ్ యాక్షన్ ప్లాన్ తీసుకొని రేపు జిల్లా కేంద్రానికి రావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వారం లో లేఅవుట్ లలో ఎలాంటి సమస్యలు లేకపోయినా పురోగతి తీసుకొని రాకుండా, చివరి స్థానంలో ఉన్న 10 ఇంజినీరింగ్ అసిస్టెంట్లను జిల్లా కేంద్రానికి పిలిపించాలని కలెక్టర్ హౌసింగ్ పీడిని ఆదేశించారు. ఇళ్ళ నిర్మాణాల్లో ప్రోగ్రెస్ లేకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
చిన్న చిన్న కారణాలు చెప్తారేంటి
ఉపాధి హామీ పనులకు సంబంధించి కొన్ని మండలాల్లో అధికారులు పట్టించుకోవడం లేదని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. కూలీలను సమీకరించకుండా ఏదో ఒక కారణం చెప్తున్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోడుమూరు, చిప్పగిరి, ఓర్వకల్లు, నందవరం, ఎమ్మిగనూరు, ఆదోని, వెల్దుర్తి, కృష్ణగిరి మండలాలు ఉపాధి పనులు కల్పించడంలో చాలా వెనుకబడి ఉన్నారని, చిన్న చిన్న కారణాలు చెప్తూ పనులు కల్పించకపోవడం ఏంటని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. రానున్న 3 నెలల్లో వంద శాతం లక్ష్యాలను సాధించేలా పనులు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎంపిడిఓ లు క్షేత్ర స్థాయి పర్యటనల గురించి తెలుసుకోడానికి టూర్ డైరీ లను తెప్పించాలని కలెక్టర్ జిల్లా పరిషత్ సీఈఓ ను ఆదేశించారు. గ్రామాల్లో మంచి నీటి ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ చేసే ప్రక్రియలో హోళగుంద, పెద్ద కడుబూరు మండలాలు వెనుకబడి ఉన్నాయని, క్లీన్ చేయించి క్లోరినేషన్ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. 2వ ఫేజ్ లో 160 చెత్త సంపద తయారీ సాప్కేంద్రాలకు గాను 140 మాత్రమే ఆపరేషన్ లోకి త వచ్చారన్నారు .పెండింగ్ లో ఉన్న వాటిని త్వరితగతిన ఆపరేషన్ లోకి తీసుకొని రావాలని కలెక్టర్ సంబంధిత మండలాల ఎంపిడిఓ, ఈఓఆర్డీ లను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న చెత్త సంపద తయారీ కేంద్రాల నిర్మాణాలు జనవరి చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. జిఎస్డబ్ల్యూఎస్ కి సంబంధించి ప్రతి ఇంటి ఫోటోను తీసి జియో కో ఆర్డినేట్స్ క్యాప్చర్ చేయాల్సి ఉందని, పెండింగ్ లో ఉన్న 2 వేలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అంగన్వాడి కేంద్రాలలో ఉండే 0 నుండి 6 ఏళ్ల పిల్లల వరకు ఆధార్ కార్డుల మంజూరుకు సంబంధించి ఐసిడిఎస్ పిడి, జిల్లా పరిషత్ సీఈవో సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. సచివాలయంలోని ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసిస్టెంట్ లు కేవలం 351 పాఠశాలలను మాత్రమే తనిఖీ చేశారని , 1100 పాఠశాలలను తనిఖీ చేయలేదన్నారు. ఈ అంశంపై ఆర్డీఓలు, ఎంపిడిఓ లు, మండల స్పెషల్ అధికారులు ఈ అంశాల పై సమీక్ష చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంఎస్ఎం ఈ సర్వేని వేగవంతం చేసి, వచ్చే 20 రోజుల లోపల పూర్తి చేయాలని కలెక్టర్ ఎంపీడీవోలను ఆదేశించారు. సబ్ కలెక్టర్, ఆర్డీవోలు ఈ అంశంపై సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ డా.బి. నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, జడ్పి సీఈవో నాసర రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ రామచంద్రారెడ్డి, డ్వామా పిడి వెంకట రమణయ్య, డిపిఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.