Manchu Manoj Comments at Mirai Success Meet: తేజ సజ్జా ‘మిరాయ్’ సినిమా ఘనవిజయం సాధించి, టాలీవుడ్ లో హంగామా సృష్టిస్తోంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం రిలీజ్ రోజే రూ.27 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ విజయోత్సవం సందర్భంగా ఈ రోజు (శనివారం) నిర్వహించిన సక్సెస్ మీట్‌లో మంచు మనోజ్ భావోద్వేగంతో మాట్లాడారు. “12 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ విజయం నా జీవితాన్ని మార్చేసింది. ఫోన్ కాల్స్, అభినందనలు ఆగడం లేదు. ఇవన్నీ కలలా అనిపిస్తున్నాయి. నన్ను ఈ కథలో భాగం చేసినందుకు దర్శకుడు కార్తిక్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను” అని మనోజ్ అన్నారు. ఆయన తన కెరీర్‌లో ఎదురైన కష్టాలను గుర్తుచేసుకున్నారు. “చాలా సినిమాలు చివరి నిమిషంలో రద్దయ్యాయి. ‘కమ్‌బ్యాక్ ఎప్పుడు?’ అని అభిమానులు అడిగేవారు. బయట ధైర్యంగా చెప్పినా, లోపల భయం వెంటాడేది. అలాంటి సమయంలో కార్తిక్ నన్ను నమ్మారు. ఆయన నాతో పాటు నా కుటుంబాన్నీ నిలబెట్టారు.” అని ఎమోషనల్ అయ్యారు.
తెలుగు సినిమా గర్వపడేలా చేశారు..
తన పిల్లల గురించి ప్రస్తావిస్తూ.. “నేను పెరిగినట్లు నా పిల్లల్ని పెంచగలనా అన్న అనుమానం ఎప్పుడూ ఉండేది. ఆ భయాన్ని కార్తిక్ తొలగించారు” అన్నారు. అలాగే నిర్మాత విశ్వప్రసాద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “మనోజ్‌తో సినిమా వద్దని ఎంతమంది చెప్పినా మీరు వెనకడుగు వేయలేదు. మీ ధైర్యం వల్లే ఈ సినిమా పూర్తయింది” అని గుర్తు చేసుకున్నారు. ఇక, వీఎఫ్‌ఎక్స్ టీమ్ చేసిన పనిని మనోజ్ ప్రశంసిస్తూ.. తెలుగు సినిమా గర్వపడేలా పని చేశారన్నారు. ప్రతి ఇంట్లో నుంచి మనోజ్ గెలవాలి అని కోరుకున్న వారందరికీ పేరుపేరునా పాదాభివందనం. నామీద నమ్మకం పెట్టుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇకపై వరుస సినిమాలు చేస్తూ మీ అందరినీ అలరిస్తాను.” అని భరోసా ఇచ్చారు. ‘మిరాయ్’లో మంచు మనోజ్ మహావీర్ లామా పాత్రలో నటించారు. ఈ పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
తొలిరోజు రూ. 27.20 కోట్ల కలెక్షన్లు..
ఇక, భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకువచ్చిన మిరాయ్ సినిమా మంచి కలెక్షన్లు వసూలు చేసి బాక్సాఫీస్‌లో భారీ విజయం సాధించింది. తాజాగా నిర్మాణసంస్థ అధికారికంగా దీని వసూళ్లను వెల్లడించింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.27.20 కోట్లు వసూలుచేసినట్లు తెలిపింది. దీనిపై హీరో తేజ సజ్జా స్పందిస్తూ.. ‘మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు, ఇదే మిరాయ్’ అని ఆనందం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్‌లోనూ ‘మిరాయ్’కు మంచి స్పందన లభిస్తోంది. మొదటిరోజు విదేశాల్లో రూ.7 లక్షల డాలర్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది. దీని వీఎఫ్‌ఎక్స్ వర్క్‌పై నెట్టింట ప్రశంసలు వస్తున్నాయి. ప్రముఖులు కూడా మిరాయ్ చిత్రంపై పోస్ట్‌లు పెడుతున్నారు. దీనిపై నిర్మాత విశ్వప్రసాద్ ఆనందం వ్యక్తంచేశారు. ఎంతో అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారని.. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ చెక్ చేసినా బ్లర్ లేకుండా స్పష్టంగా కనిపిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా వీఎఫ్ఎక్స్ టీమ్‌ను ప్రశంసించారు.


