Wednesday, May 21, 2025
HomeNewsముంబై-ఢిల్లీ మ్యాచ్ కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ప్లే ఆఫ్స్‌కు చేరేదెవరు..?

ముంబై-ఢిల్లీ మ్యాచ్ కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ప్లే ఆఫ్స్‌కు చేరేదెవరు..?

ఐపీఎల్ 2025 హీట్‌ క్లైమాక్స్‌కు చేరింది. ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం రెండు దిగ్గజ జట్లు — ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ — ముంబై వాంఖడే స్టేడియంలో తలపడనున్నాయి. ఇప్పటిదాకా ముంబై 12 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ 13 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ ఫలితం ప్లే ఆఫ్స్ దిశగా కీలకంగా మారనుంది.

- Advertisement -

ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే వారు 16 పాయింట్లు సాధించి నేరుగా ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాన్ని దక్కించుకుంటారు. అయితే ఢిల్లీ విజయం సాధిస్తే.. ముంబైకి పోటీ పెరుగుతుంది. దీంతో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం చివరి మ్యాచ్ వరకు వేచి చూడాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా వాతావరణం ఈ పోరును భయపెడుతోంది. వాంఖడే వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది.

నాలుగు రోజుల పాటు ముంబైలో వర్షం కురిసే సూచనలు ఉండటంతో, ఇప్పటికే యెల్లో అలెర్ట్‌ జారీ అయింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది. ఈ పరిస్థితి ప్లే ఆఫ్స్ అంకె లెక్కల్లో కీలకమైన ప్రభావం చూపనుంది. రెండు జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్‌ను ఎదుర్కొనాల్సి ఉంది. మే 24న ఢిల్లీ – పంజాబ్ మ్యాచ్ ఉండగా, మే 26న ముంబై – పంజాబ్ మ్యాచ్ జరగనుంది. వర్షం కారణంగా ముంబై-ఢిల్లీ మ్యాచ్ రద్దయితే, ఢిల్లీకి ప్లే ఆఫ్స్ ఆశలు నిలవాలంటే.. పంజాబ్‌పై భారీ విజయం సాధించాలి.

అదే సమయంలో ముంబై, పంజాబ్ చేతిలో ఓడితే మాత్రమే ఢిల్లీకి చాన్స్ ఉంటుంది. లేదంటే ఢిల్లీ పోటీ నుండి తప్పుకునే అవకాశమే ఎక్కువగా ఉంది. మరోవైపు పంజాబ్ తమ చివరి రెండు మ్యాచులు గెలిస్తే.. ముంబై నేరుగా ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెడుతుంది. ఏ విధంగానైనా ముంబై-ఢిల్లీ పోరుకు వర్షం కలుపుతుందా లేదా అనేది ఇప్పుడు అభిమానులకు ఆసక్తికర అంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News