MLA Opens Fire on Police: ఆయనో ప్రజాప్రతినిధి.. ఆయనపై రేప్ కేసు నమోదైంది. దీంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్తున్నారు. ‘నన్ను అరెస్టు చేస్తారా’ అంటూ ఆయన, ఆయన అనుచరులు కలిసి పోలీసులపైకి కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. అంతేకాదు తన ఎస్‌యూవీ వాహనానికి అడ్డుగా వచ్చి పోలీసులపైకి కూడా కారు ఎక్కించాడు. దీంతో ఒక పోలీసు గాయపడ్డాడు.
ఈ సంఘటన పంజాబ్‌లోని పాటియాలా చోటు చేసుకుంది. అధికార ఆప్ ఎమ్మెల్యే హర్మిత్ సింగ్ పఠాన్‌మజ్రపై రేప్ కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. తన అరెస్టును తప్పించుకునేందుకు ఆయన పోలీసులపైకి కాల్పులు జరిపి, తన వాహనంతో పోలీసులను ఢికొట్టేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఆయన ఎస్‌యూవీ వాహనం ఒక పోలీసుపైకి ఎక్కించారని చెప్పారు.
అయితే తాను ఢిల్లీ ఆప్ నాయకత్వాన్ని విమర్శించిన మరుసటి రోజే తనపై కేసు నమోదైందని ఎమ్మెల్యే హర్మిత్ సింగ్ చెబుతున్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. తన మాజీ భార్య పెట్టిన కేసు నడుస్తుండగా.. తాజాగా రేప్ కేసు పెట్టించారని… ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనేనని ఆయన అంటున్నారు.
‘నేను ఢిల్లీలోని మా సొంత ప్రభుత్వం, పార్టీ ఢిల్లీ నాయకత్వంపై మాట్లాడినందుకు నాపై తప్పుడు కేసు బనాయించారు’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా, ఇదే అంశంపై ఆయన సోదరుడు హర్దేవ్ సింగ్ మాట్లాడుతూ హర్దీప్ సింగ్‌ను ఐపీసీ 376 కింద అరెస్టు చేశారని, కానీ ఇదే కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెబుతున్నారు. హర్యానాలోని దబ్రీలో అరెస్టు చేశారని…ఇదంతా అతని గొంతు నొక్కే ప్రయత్నమని ఆరోపించాడు.
అయితే తన అరెస్టుకంటే ముందు పాటియాలా ఎస్ఎస్పీ ఆఫీసుకు తన మద్దతుదారులు పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, ట్రాలీలు, కార్లలో తరలిరావాలని హర్దీప్ సింగ్ ఫేస్‌బుక్ ద్వారా కోరారు. ‘నా మీద ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ఢిల్లీ ఆప్ పంజాబ్‌లో పరిపాలన కొనసాగిస్తుందా? కాంగ్రెస్, బీజేపీలు కూడా ఈ సాహసానికి దిగలేవు’ అని హర్మిత్ సొంత పార్టీపై మండిపడ్డారు.
ఢిల్లీ ఆప్ నాయకత్వం పంజాబ్ ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ నడిపిస్తోందని ఆరోపించారు. సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న ఎమ్మెల్యేకు ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గించడం గమనార్హం.
కాగా, హర్మిత్ సింగ్ అరెస్టుతో పంజాబ్ ఆప్ పార్టీలో ముసలం మొదలైంది. క్రమశిక్షణా చర్యలపేరుతో పార్టీ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోందని సొంత ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నారు.


