సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య రాజకీయ దుమారం రేపుతోంది. 85 ఏళ్ళ సాయిరెడ్డి (Saireddy) అనే వృద్ధుడు తన మరణానికి రేవంత్ రెడ్డి బ్రదర్సే కారణమని తన సూసైడ్ నోట్ (Suicide Note) లో ఆరోపించాడు. తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని, కానీ తన రేవంత్ రెడ్డి సోదరులు వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నాడు.
సాయిరెడ్డి (Saireddy) తాను 40 ఏళ్ళ క్రితం నిర్మించుకున్న ఇంటికి పాల బూత్ పక్క నుండి తన సొంత ఖర్చులతో దారిని ఏర్పాటు చేసుకున్నానని సూసైడ్ నోట్ (Suicide Note) లో తెలిపాడు. అయితే ఇప్పుడు ఆ పాల బూత్ పక్కనే వెటర్నర్నరీ హాస్పిటల్ నిర్మించి, రేవంత్ రెడ్డి సోదరులు తన ఇంటికి వెళ్లే దారి లేకుండా గోడ నిర్మిస్తున్నారని పేర్కొన్నాడు. అందుకే మనస్తాపంతో సూసైడ్ చేసుకుంటున్నట్లు లేఖలో రాశాడు.
Also Read : రోడ్డుపై సర్వే పత్రాలు.. హరీష్ రావు చురకలు
ప్రస్తుతం సాయిరెడ్డి సూసైడ్ వార్త రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని, ఆయన సోదరులని తీవ్రంగా తప్పుబడుతున్నారు. వారి కుటుంబ వేధింపులవల్లే సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని మండిపడుతున్నారు. ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ప్రజల పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో తెలిపేందుకు ఇది ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.
ఆత్మహత్య కాదు హత్యే.. కేటీఆర్
సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డిది ఆత్మహత్య కానే కాదు, ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్యనే అని కేటీఆర్ ఆరోపించారు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ లో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి బ్రదర్స్ తనపై కక్ష కట్టడం వల్లే చనిపోతున్నానని సాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలన్నారు. పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా అనుముల బ్రదర్స్ పై కేసు నమోదుచేసి, సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.