Salman Khan| బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(SalmanKhan)కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రూ.5కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని హెచ్చరించడంతో సల్మాన్ అప్రమత్తమయ్యాడు. తన భద్రతపై మరింత ఫోకస్ చేశాడు. ఈ క్రమంలోనే దుబాయ్ నుంచి రూ.2కోట్లు విలువైన బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. అతి త్వరలోనే ఇది సల్మాన్ ఇంటికి చేరుకుంటుందని సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు కూడా సల్మాన్‌కు భారీ భద్రత కల్పిస్తున్నారు. మూవీ షూటింగ్‌లతో పాటు బిగ్ బాస్ షూటింగ్లో కూడా నిరంతరం సల్మాన్ భద్రతను సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
కాగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సల్మాన్‌కు ఉన్న వైరం ముగియాలంటే రూ.5కోట్లు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతూ పోలీసులకు వార్నింగ్ మెసేజ్ వచ్చిన విషయం విధితమే. ఆ మెసేజ్‌లో ఏముందంటే.. ‘సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో శత్రుత్వాన్ని ముగించుకోవాలన్నా రూ.5కోట్లు చెల్లించాలి. ఈ డబ్బులు ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే ఆయన దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ బెదింపులను తేలిగ్గా తీసుకోవద్దు’ అని హెచ్చరించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో పాటు బాంద్రాలోని సల్మాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
సల్మాన్‌ఖాన్‌కు ఇదే తొలి బెదిరింపు కాదు. కృష్ణజింకలను వేటాడిన కేసు నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు చంపేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్ నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. అంతకుముందు పన్వేల్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు కొందరు ప్రయత్నించారు. దీంతో సల్మాన్ ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసుల భద్రతను పెంచింది. తాజాగా మరోసారి చంపేస్తామని బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు.