Wednesday, March 19, 2025
HomeNewsSunita Williams: సునీత విలియమ్స్ కి భారత్ తో ఉన్న సంబంధం ఇదే..!

Sunita Williams: సునీత విలియమ్స్ కి భారత్ తో ఉన్న సంబంధం ఇదే..!

నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్నప్పుడు.. ఆమె క్షేమంగా తిరిగి రావాలని అందరూ ప్రార్థించారు. సునీత విలియమ్స్ భారతీయ వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ మన దేశ పౌరులు గర్వపడుతున్నారు. ముఖ్యంగా గుజరాత్‌లోని ఝులసన్ గ్రామస్తులు ఆమెతో తమకున్న సంబంధాన్ని గర్వంగా చెప్పుకుంటారు. సునీత విలియమ్స్ తండ్రి, తాతలకు ఈ గ్రామం ఒకప్పుడు నిలయం. సునీత విలియమ్స్ కూడా 1972, 2007, 2013లలో ఈ గ్రామాన్ని సందర్శించారు.

- Advertisement -

ఝులసన్ గ్రామస్తులు సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకోవాలని.. దీపాలు వెలిగించి, దేవుడిని ప్రార్థించారు. తండ్రి వైపు నుంచి భారతీయ వారసత్వం కారణంగా మన దేశంతో ఆమెకు బలమైన అనుబంధం ఉంది. సునీత విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్‌లో జన్మించి 1957లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఆయన ఉర్సులిన్ బోనీని వివాహం చేసుకున్నారు. దీపక్ పాండ్యా, ఉర్సులిన్ బోనీ దంపతులకు ముగ్గురు సంతానం. సునీత విలియమ్స్ వారిలో చిన్న కుమార్తె. ఆమె 1965లో అమెరికాలోని యూక్లిడ్‌లో జన్మించారు.

సునీత విలియమ్స్ అన్నయ్య పేరు జే థామస్, అక్క పేరు దీనా అన్నద్. దీపక్ పాండ్యా 2020లో మరణించారు. దీపక్ పాండ్యా తండ్రి కూడా ఝులసన్ గ్రామానికి చెందినవారే. ఈ గ్రామంలో దాదాపు 7,000 మంది జనాభా ఉన్నారు. సునీత విలియమ్స్ తాత, బామ్మ పేరు మీద అక్కడ ఒక లైబ్రరీ ఉంది. ఆమె తండ్రి దీపక్ పాండ్యా పూర్వీకుల ఇల్లు కూడా అక్కడే ఉంది. 2007లో సునీత విలియమ్స్ ఆ గ్రామంలోని పాఠశాలను సందర్శించినప్పుడు ఆమె బంధువు కిశోర్ పాండ్యా ఆమెను కలిశారు.

సునీత విలియమ్స్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను చాలాసార్లు సందర్శించారు. భారతీయ శాస్త్రవేత్తలు, విద్యార్థులతో ఆమె ముచ్చటించారు. తన అంతరిక్ష యాత్రలలో సునీత విలియమ్స్ భగవద్గీత కాపీని, గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్లారు. ఇది మన దేశంతో ఆమెకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుబంధాన్ని చూపిస్తుంది. 2008లో భారత ప్రభుత్వం సునీత విలియమ్స్‌ను పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News