టీడీపీ వార్షిక మహాసభలైన ‘మహానాడు’ ఈసారి వైఎస్సార్ జిల్లాలో తొలిసారి జరుగుతుండం చర్చనీయాంశమైంది. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పబ్బాపురం సమీపంలో 150 ఎకరాల విస్తీర్ణంలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఈ మహానాడు జరగనుంది. ఇప్పటికే సభా ప్రాంగణం సిద్ధమవుతున్న వేళ, టీడీపీ నేతలు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
వర్షం వల్ల సభా ప్రాంగణంలోకి నీరు చేరిన నేపథ్యంలో, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా రంగంలోకి దిగి పారతో మట్టి తొవ్వుతూ వేదిక పరిసరాలను సుమారు చేశారు. ఆయన మహానాడు సభా ప్రాంగణ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఆటంకం లేకుండా మహానాడు కొనసాగించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు.
వచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లన్నింటిని జాగ్రత్తగా ప్రణాళికబద్ధంగా చేపట్టారు. ట్రెంచింగ్ పనులు వేగంగా కొనసాగుతుండగా, వేదిక చుట్టూ నీరు నిలవకుండా నాళాలు, మట్టి పొరలు వేసే పని శరవేగంగా సాగుతోంది. మహానాడు వేదిక, కడప పట్టణం, కమలాపురం ప్రాంతాలు టీడీపీ పార్టీ రంగులతో కళకళలాడుతున్నాయి. భారీ కటౌట్లు, పసుపు రంగు ఫ్లెక్సీలు, తోరణాలతో ప్రాంతం ఒక్క పార్టీ సంబరంగా మారింది.
సీఎం చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం కడపకు చేరుకోనున్నారు. ఆయన మహానాడు ప్రాంగణంలో నాలుగు రోజుల పాటు బస చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను మంత్రి నిమ్మల ఇప్పటికే పర్యవేక్షించారు. మరోవైపు, మంత్రి నారా లోకేశ్ ఈ రోజు కుప్పం నుంచి కడప చేరుకోనున్నారు. ఇప్పటికే మంత్రులు, కీలక నేతలు మహానాడు కోసం కడప చేరుకున్నారు.