ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. తుదిపోరులో కివీస్ పై నాలుగు వికెట్ల తేడాతో భారత్ విజయం సొంతం చేసుకుంది. 2013 తర్వాత మరోసారి భారత క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో విజేతగా నిలిచింది. ఈ టైటిల్ ను గెలవడం భారత్ కు ఇది మూడోసారి. న్యూజిలాండ్ నిర్దేశించిన 253 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (83) ధనాధన్ బ్యాటింగ్ తో మెరిశాడు. శ్రేయస్ అయ్యర్ (48) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక చివర్లో కేఎల్ రాహుల్ (34 నాటౌట్) మ్యాచ్ ను ఫినిష్ చేశాడు.
ఒక మాదిరి లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను రోహిత్ తన దూకుడైన బ్యాటింగ్ తో లక్ష్యం వైపునకు నడిపించాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్ లో శుబ్ మన్ గిల్ (31)తో కలిసి తొలి వికెట్ కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే గ్లెన్ ఫిలిప్స్ పట్టిన అద్భుత క్యాచ్ కు గిల్ అవుటయ్యాడు. ఆ వెంటనే కోహ్లీ (1) ఎల్బీ అయ్యాడు. ఈ క్రమంలో రోహిత్, శ్రేయస్ అయ్యర్ లు ఆచితూచి ఆడారు. అనంతరం భారీ షాట్ కు ప్రయత్నించిన రోహిత్ శర్మ స్టంపౌట్ అవుతాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ (29) కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పుతారు. అయితే కీలక సమయంలో వీరిద్దరు అవుటవుతారు. అయితే కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలు జట్టును విజయం వైపు నడిపిస్తారు. చివర్లో హార్దిక్ పాండ్యా అవుటైనా కేఎల్ రాహుల్, జడేజాలు మ్యాచ్ ను ఫినిష్ చేస్తారు.
అంతకముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రచిన్ రవీంద్ర టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. యడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో చూస్తుండగానే కివీస్ స్కోరు 7 ఓవర్లలోనే 50 పరుగులు దాటిపోయింది. మరో ఓపెనర్ విల్ యంగ్ (15) ఆరంభం నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఎల్బీగా విల్‌యంగ్ ఔట్ చేయడం ద్వారా వరుణ్ చక్రవర్తి 57 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు.
ఈ దశలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. రచిన్, కేన్ విలియమ్స్ సన్ (11), టామ్ లాథమ్ (14) స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో 108 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కివీస్ కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ తో కలిసి ఆదుకున్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 57 పరుగులు జోడించిన తరువాత ఫిలిప్స్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. మరోవైపు డారిల్ మిచెల్ సింగిల్స్, డబుల్స్‌తో స్కోరు బోర్డును నడిపించాడు.
చెత్త బంతును బౌండరీలకు తరలించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరిలో వేగంగా ఆడే క్రమంలో షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రోహిత్ శర్మ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. చివరల్లో బ్రాస్‌వెల్ మెరుపులు మెరిపించడంతో కివీస్ స్కోరు 250 దాటింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా, షమీలు తలా ఓ వికెట్ పడగొట్టారు.