CM Revanth Reddy on Government Schools : తెలంగాణలో విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 2025-26 విద్యా సంవత్సరం నుండి 20 మందికి పైగా విద్యార్థులున్న గ్రామాలు, పట్టణాల్లో కొత్తగా 571 ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యమన్న ఆయన, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడానికి ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. మౌలిక వసతులు, ఉపాధ్యాయుల శిక్షణకు ప్రాధాన్యతనిచ్చారు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సీఎం సమీక్షించి, బోధనా ప్రమాణాల పెంపునకు చర్యలు సూచించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారులు, సీఎంవో, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విద్యారంగంలో నూతన ఒరవడికి శ్రీకారం :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. కేవలం భాషా పరిజ్ఞానానికే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించే దిశగా విద్యావిధానం మారాలని స్పష్టం చేశారు. ప్రధానంగా హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తే, భవిష్యత్తులో వారికి ఇష్టమైన రంగాల్లో రాణించే అవకాశాలు మెరుగుపడతాయని సీఎం అభిప్రాయపడ్డారు.
ఇష్టమైన రంగంలో రాణించే అవకాశం :
విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాల పెంపునకు వీలుగా విద్యావ్యవస్థను మార్చాలన్నారు. హైస్కూల్ స్థాయి నుంచి విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే భవిష్యత్తులో వారు తమకు ఇష్టమైన రంగంలో రాణించే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ పురపాలక శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచన చేశారు. హెచ్‌ఎండీఏ, మున్సిపల్ లేఅవుట్లలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాల్లో స్కూళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
గురుకులాల స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం :
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల కింద ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యా సంస్థలను హేతుబద్ధీకరించి, ప్రతి పాఠశాలలో కావాల్సిన సంఖ్యలో విద్యార్థులు చదివేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గురుకులాల్లో యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నందున విద్యార్థులు పెద్ద సంఖ్యలో వాటి వైపు మొగ్గు చూపుతున్నారని సీఎం గుర్తించారు. ఈ సౌకర్యాలను డే స్కాలర్లకు కూడా అందించే విషయంపై అధ్యయనం చేయాలని ఆయన సూచించారు.


