ఆర్ధిక ఇబ్బందుల కారణంతో విద్యార్థులు తమ చదువును మధ్యలో ఆపొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ లోని సంకేత్ సోషల్ ఆవేర్ నెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఆర్ధిక సహాయం చెక్కులను మంత్రి అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మన బస్తీ మన బడి కార్యక్రమం క్రింద ప్రభుత్వం రూ.7,200 కోట్ల వ్యయంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన ఫర్నిచర్, త్రాగునీటి వసతి విద్యుత్, టాయిలెట్స్ సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఆర్ధిక సహాయం అందించిన సంకేత్ నిర్వహకులను మంత్రి అభినందించారు.
ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు మరింతగా విస్తరించాలని, అందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. సంకేత్ ఆర్గనైజేషన్ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు గాను వ్యక్తిగతంగా రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తానని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకొనే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలపై ఉన్న అపోహలను తొలగించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ వైద్య సేవలను కూడా ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నూతనంగా ఎర్రగడ్దలో వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిర్మిస్తున్నట్లు వివరించారు. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, సంకేత్ సంస్థ అధ్యక్షుడు మురళి తదితరులు పాల్గొన్నారు.