క్రీడారంగ అభివృద్దికి కేసిఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అమీర్‌పేటలోని గురుగోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో క్రీడాకారులకు కేసిఆర్ స్పోర్ట్స్ కిట్ల పంపిణీ చేశారు ఆయన. ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన మంత్రి కిట్లను క్రీడాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులను సైతం ప్రోత్సహించే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ పోటీలను నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా క్రీడా మైదానాలను కూడా ఎంతో అభివృద్ధి చేసి అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వివరించారు.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో జరిగే వివిధ క్రీడలలో రాణించిన క్రీడాకారులను ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. క్రీడాకారులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని క్రీడలలో మరింతగా రాణించాలని కోరారు. అనంతరం చిన్నారుల స్కేటింగ్ విన్యాసాలను వీక్షించిన మంత్రి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, స్పోర్ట్స్ ఇన్ స్పెక్టర్ మాధవి, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.